స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!

15 Aug, 2014 13:15 IST|Sakshi
స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!

ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఎంతో మంది పోరాడారు. ఆ పోరాటంలో తెలుగువారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య..... మేము సైతం అంటూ పాల్గొన్నారు.

భోగరాజు పట్టాభిసీతారామయ్య : భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీ మహత్ముడికి  సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1948లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన ఆంధ్రాబ్యాంక్ను స్థాపించారు. నాటి కృష్ణా జిల్లాలోని గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు.

పింగళి వెంకయ్య : దేశానికి పతాకాన్ని అందించిన యోధుడు పింగళి వెంకయ్య. ఈయన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం  భట్లపెనుమర్రులో వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఆయన.. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే మహాత్మాగాంధీని కలిశాడు. భారత్ వచ్చిన వెంకయ్య... ఆ తర్వాత జెండా రూపొందించాలనే తలంపుతో 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఆయన రూపొందించిన నాటి పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది.

దుర్గాబాయి దేశ్‌ముఖ్ : భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త.. ఇలా భిన్న పార్శ్వాలున్న వ్యక్తి దుర్గాబాయి దేశ్ముఖ్. 1909, జులై 15న ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ బోధించేవారు. చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్ముడు ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోకి అనువదించేవారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది.

కొండా వెంకటప్పయ్య : కొండా వెంకటప్పయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‍కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు.

దుగ్గిరాల గోపాల కృష్ణయ్య : రామదండు అనే దళాన్ని స్థాపించి.. చీరాల - పేరాల ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఈయన1889 జూన్‌ 2 న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. 1921 లో సహాయనిరాకరణోద్యమ సందర్భంగా గాంధీగారి ఉపన్యాసాలను అనువదించినందుకు ప్రభుత్వం ఈయనకు ఇచ్చిన భూమిని రద్దుచేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాది పాలు తిరుచిరాపల్లి జైల్లో ఉన్నారు. 1923 లో అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీరాలపేరాలలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత ఆయనదే.

టంగుటూరి ప్రకాశం పంతులు :  సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, మళ్లీ మరణించే సమయానికి కట్టుబట్టలతో మిగిలిన నిజాయితీపరుడు. 1940, 50లలోని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు.

మరిన్ని వార్తలు