కష్టాలు తొల‘గంగ’

3 Jul, 2020 09:47 IST|Sakshi
తెలుగుగంగ కాలువ లైనింగ్‌ పనుల దృశ్యం

మొదలైన తెలుగుగంగ కాల్వ పనులు

పూడికతీతతో పాటు లైనింగ్‌కు రూ.320 కోట్ల ఖర్చు

రివర్స్‌ టెండర్‌ ద్వారా ప్రజాధనం ఆదా చేసిన ప్రభుత్వం

వచ్చే ఏడాదికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం

ఇసుక కొరత లేకుండా ప్రత్యేక చర్యలకు సీఎం ఆదేశం 

తెలుగుగంగ..గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురిసి..సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు రెండు పంటలు వేసుకోలేని దుస్థితి. ఎన్నో ఏళ్లుగా కాల్వ లైనింగ్‌ చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఏర్పడేవి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి..పనులు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి.

కర్నూలు సిటీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నీరు పారకుండానే నిధులు పారించింది. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచి.. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు లబ్ధి చేకూర్చింది. అయితే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం..సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా ధనాన్ని దురి్వనియోగపర్చకుండా రివర్స్‌ టెండర్ల ద్వారా పనులు చేయిస్తోంది. తెలుగుగంగ కాలువకు లైనింగ్‌ పనులు ఈ కోవకు చెందినవే. సుమారు రూ.320 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా పిలిచి.. జ్యూడీíÙయల్‌ కమిటీ నిర్ధారించిన తరువాత పనులు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇటీవలే పనులు మొదలు పెట్టారు.  

లైనింగ్‌తో ఆయకట్టుకు సమృద్ధిగా నీరు.. 
తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు 18.20 కి.మీ వరకు లైనింగ్‌ లేదు. దీంతో సాగు నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.  కాల్వ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు ఉండగా.. లైనింగ్‌ లేకపోవడంతో నీరు దిగువకు వెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల చివరి ఆయకట్టుతో పాటు వైఎస్సార్‌ జిల్లాకు సాగు నీరు అందేది కాదు. ప్రతి ఏటా సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చేది. ఈ పనులను టీడీపీ ప్రభుత్వం 3.5 ఎక్సెస్‌ రేటుకు టెండర్లను టీడీపీకి చెందిన నేతకు కట్టబెట్టింది. అయితే పనులు మొదలు పెట్టకపోవడంతో రద్దు చేసి.. రివర్స్‌ టెండర్‌ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

ఇందులో గతంలో ఎక్సెస్‌ కంటే తక్కువకు టెండర్లు వేసి పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ దక్కించుకుంది. ఈ రివర్స్‌ టెండర్లతో ప్రభుత్వానికి రూ.12 కోట్లకుపైగా ఆదా అయినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. కాల్వ లైనింగ్‌తో పాటు పూడిక తీత పనులు రూ.320 కోట్లతో చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులకు ఇసుక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన జల వనరుల శాఖ సమీక్షలో ఉన్నతాధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయితే రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పనులు మొదలయ్యాయి..
తెలుగుగంగ లైనింగ్‌ పనులు ఇటీవలే మొదలు అయ్యాయి. అటవీ ప్రాంతంలో ఇబ్బందులు ఉండేవి. ఆ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాం. రివర్స్‌ టెండర్ల ద్వారా 4 శాతం నిధులు ఆదా అయ్యాయి. 
– ఆర్‌.మురళీనాథ్‌రెడ్డి, జల వనరుల శాఖ సీఈ  

మరిన్ని వార్తలు