ఉద్యోగాల కోసం నిరీక్షణ

30 Sep, 2019 11:20 IST|Sakshi
బ్రహ్మంసాగర్‌

తెలుగుగంగ ముంపువాసులకు ఉద్యోగ అవకాశాలు  దక్కేనా!

ప్రాజెక్టు ప్రారంభంలో 1980 కుటుంబాలను ఎంపిక చేసిన ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు

సాక్షి, బ్రహ్మంగారిమఠం (కడప): తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్రహ్మంగారిమఠం సమీపంలోని ఓబులరాజుపల్లె పంచాయతీలోని 6 గ్రామాలు సాగర్‌లో ముంపునకు గురయ్యాయి. 1983– 1987లో ఆ గ్రామాల పరిధిలో 1980 కుటుంబాలకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అవార్డులు పొందిన కుటుంబాలలో చదువుకున్నవారికి నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. అవార్డులు పొందిన వారిలో చదువుకోనివారు ఉంటే అలాంటి కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కింద 5ఎకరాలు వ్యవసాయపొలం, ఇళ్లు వంటివి కేటాయించారు. అప్పటి ప్రభుత్వం కేవలం 480 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించింది. 2005లో ముంపు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన వైఎస్సార్‌ నిబంధనల ప్రకారం నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని అప్పటి కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో అప్పట్లో అధికారులు నిరుద్యోగుల జాబితా తయారు చేశారు. అయ్యినా నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు దక్కలేదు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 420 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు
బ్రహ్మంసాగర్‌ ముంపు వాసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీఓలు ఉన్నా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముంపు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయి. చివరకు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.
– రాజోలి జగన్నాథరెడ్డి (సాగర్‌ ముంపు నిరుద్యోగ కమిటీ చైర్మన్‌ బి.మఠం మండలం)

అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు
గత మూడు సంవత్సరాలుగా తెలుగుగంగ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏఒక్క అధికారి స్పందించడంలేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగం కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. చదువుకున్నా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.
– బి.రామసుబ్బయ్య (కమిటీ వైస్‌చైర్మన్, బి.మఠం మండలం)

ముఖ్యమంత్రిపైనే ఆశలు పెట్టుకున్నాం
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మంసాగర్‌ ముంపు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నాం. మా సమస్యలు ముఖ్యమంత్రికి తెలుపుకొనేందుకు అధికారులు అవకాశం కల్పించాలి.
– యు.పెంచలరత్నం( సాగర్‌ ముంపు నిరుద్యోగి)

మరిన్ని వార్తలు