నవలా రచయిత కేశవరెడ్డి కన్నుమూత

14 Feb, 2015 01:55 IST|Sakshi
నవలా రచయిత కేశవరెడ్డి కన్నుమూత

- ‘లింగ్‌ఫోమా’ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి
- నిజామాబాద్‌లో నేడు అంత్యక్రియలు
- నిజామాబాద్ జిల్లాలో 30 ఏళ్లపాటు కుష్టురోగులకు సేవలు
- రచయితగా జాతీయస్థాయి ఖ్యాతి


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత, వైద్యుడు డాక్టర్ పి.కేశవరెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిజామాబాద్‌లోని ప్రగతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘‘అతడు అడవిని జయిం చాడు, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటిపుల్, మునెమ్మ, శ్మశానాన్ని దున్నేరు, చివరి గుడిసె, రాముడుం డాడు-రాజ్జిముండాది..’’ వంటి నవలలు రాసి జాతీయస్థాయిలో పేరొం దిన డాక్టర్ కేశవరెడ్డి (69) మరణం సాహితీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు భార్య ధీరమతి, కుమారుడు డాక్టర్ నందన్‌రెడ్డి, కుమార్తె డాక్టర్ దివ్య ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తలపులపల్లికి చెందిన ఆయన 30 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా వైద్యుడైన కేశవరెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో సేవలందించారు. డిచ్‌పల్లి మండలం విక్టోరియా ఆస్పత్రిలో వైద్యాధికారిగా పదవీ విమరణ చేశారు. నిజామాబాద్, ఆర్మూరుల లో ప్రజావైద్యశాలలు నిర్వహిస్తూనే సాహితీవేత్తగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నవలలు రాశారు. ఆయన రచనలపై విద్యార్థులు పరిశోధనలు చేసి పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాలు సమర్పించారు.  

    
నేడు అంత్యక్రియలు
శనివారం నిజామాబాద్‌లో డాక్టర్ కేశవరెడ్డికి అంత్యక్రియలు నిర్వహిం చనున్నారు. ఐదు మాసాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరకు లింగ్‌ఫోమా క్యాన్సర్ వ్యాధిగా వైద్యులు నిర్ధారిం చడంతో ఆయనకు కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌లోని కిమ్స్, నిజామాబాద్‌లోని విజన్, ఎస్‌ఎస్‌కే హార్ట్ ఆస్పత్రులలో చికిత్స చేయిం చారు. శుక్రవారం తెల్లవారు జామున పరి స్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్‌హోమ్‌కు తరలించగా ఉదయం 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేశవరెడ్డి చర్మవ్యాధుల నిపుణుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారు.


చిత్తూరు జిల్లాలో జననం
 ఏపీలోని చిత్తూరు జిల్లా తలుపులపల్లిలో 1946 మార్చి 10న జన్మించిన కేశవరెడ్డి తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్. చేశా రు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో గల విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో 3 దశాబ్దాలపాటు కుష్టు రోగులకు సేవలందించి ఉద్యో గ విరమణ పొందారు. విక్టోరియా ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తూనే వారంలో రెండు రోజులు ఆర్మూర్‌లో కూడా కుష్టురోగులకు ఉచితంగా వైద్య సేవలందించారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘అతడు అడవిని జయించాడు’ నవలను నేషనల్ బుక్‌ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇన్ క్రెడిబుల్ గాడెస్ నవలను మరాఠీ, కన్నడ భాషల్లోకి అనువదించారు. అంతర్జాతీయ తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ అజో-విభో ఫౌండేషన్ నుంచి ఆయన ఉత్తమ నవలా రచయిత పురస్కారం అందుకున్నారు.

సమాజంలో పాతుకుపోయిన పేదరికం, మూఢనమ్మకాలు.. సామాజిక రుగ్మతులను నిర్మూలించేందుకు... పలు కథాంశాలు ఎంచుకుని... ప్రజలను చైతన్యపరిచేలా పలు నవలలు రచించారు. మూగవాని పిల్లన గ్రోవి (1996), చివరి గుడిసె (1996) అతడు అడివిని జయించాడు (1980), ఇన్ క్రెడిబుల్ గాడెస్ (క్షుద్ర దేవత) (1979), శ్మశానం దున్నేరు (1979), సిటీ బ్యూటిఫూల్ (1982), మునెమ్మ (2008) తదితర రచనలు చేశారు.


 ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ కవిత సంతాపం
 ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేశవరెడ్డి మృతిపట్ల నిజామాబాద్ ఎంపీ కవిత సంతాపం తెలిపారు. డాక్టర్ కేశవరెడ్డి డిచ్‌పల్లిలో కుష్టురోగులకు అందించిన సేవలు మరువలేనివని కవిత పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

 

మరిన్ని వార్తలు