కొలంబోలో.. తెలుగు వారి కాయ్‌ రాజా కాయ్‌!

20 May, 2018 10:31 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీలంకకు జూదప్రియుల పరుగులు

గతేడాది కాసినో కోసం 26,000 మంది వెళ్లినట్లు అంచనా 

రాజధాని అమరావతితోపాటు భీమవరం వాసులే అత్యధికం

సాక్షి, అమరావతి: జూద ప్రియులను ఇప్పుడు శ్రీలంక అమితంగా ఆకర్షిస్తోంది. పొద్దున్నే విమానం ఎక్కి వెళ్లి పేకాడుకుని మర్నాడు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. కాసినో (జూద క్రీడ) కోసం ఇన్నాళ్లూ గోవా, మకావూ, మలేషియా, సింగపూర్‌ తదితర చోట్లకు వెళ్తున్న వారి చూపు ఇప్పుడు శ్రీలంకవైపు మళ్లింది. హైదరాబాద్, విశాఖల నుంచి శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో జూదరులు కొలంబోకి క్యూ కడుతున్నారు. గతేడాది హైదరాబాద్, విశాఖల నుంచి జూద క్రీడల (కాసినో) కోసం సుమారుగా 26,000 మంది వచ్చినట్లు కొలంబోలోని బెలాజియో కాసినో మార్కెటింగ్‌ హెడ్‌ సిసిరా సెమసింఘే తెలిపారు. ఈ ఏడాది ఈ సంఖ్య 30,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

గోవాతో పోలిస్తే చౌకనే..
కాసినో కోసం శ్రీలంక వెళ్తున్న వారిలో రాజధాని అమరావతి, భీమవరం ప్రాంతాలకు చెందిన బడాబాబులే అధికంగా ఉంటున్నారు. గోవాలో కాసినో కోసం సముద్రంలో సరిహద్దు జలాల వరకు వెళ్లాల్సి రావడం, పన్నుల భారం పెరగడం లాంటి కారణాలతో కొలంబో వెళ్తున్నట్లు చెబుతున్నారు. గోవా కంటే తక్కువ ఖర్చులో కాసినో కేంద్రాలు ఉండటంతో కొలంబో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొలంబోలో అతిపెద్ద కాసినోలు 5 ఉన్నాయి. 

మందు, విందు... సకల సదుపాయాలు
కాసినో కోసం వచ్చే బడాబాబుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాసినోలు, ఫైవ్‌స్టార్‌ హోటల్స్, ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఉమ్మడిగా ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఫ్లైట్‌లో తీసుకెళ్లి ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో వసతి ఏర్పాటు చేయడమే కాకుండా మందు, విందు లాంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మూడు రాత్రులు, నాలుగు రోజులు కలిపి హోటల్‌లో రూము, ఏర్పాట్లను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సెమసింఘే తెలిపారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే కొలంబో చేరుకునే అవకాశం ఉండటం, టికెట్‌ ధరలు కూడా తక్కువగా ఉండటం కలిసి వస్తోందంటున్నారు. 

విమానాల్లో ప్రత్యేక ధరలు
ఒకరోజు వెళ్లి ఆడుకుని వచ్చే విధంగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ తెలంగాణ, ఏపీ మేనేజర్‌ చమ్మిక ఇద్దగోడగే తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పారు. మర్నాడు ఉదయం 7.15కి బయలు దేరితే 9.15 కల్లా వచ్చే విధంగా సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు. కొలంబోకు విశాఖ నుంచి రూ. 11,000, హైదరాబాద్‌ నుంచి రూ. 15,500 ధరలతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు చమ్మిక తెలిపారు. 

డబ్బు కడితే ఏజెంట్లే చూసుకుంటారు..
జూద క్రీడల పట్ల మక్కువ చూపే బడా బాబులను గుర్తించేందుకు ఈ సంస్థలు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి ప్రమోషన్‌ ఈవెంట్లు నిర్వహించి ఆకర్షిస్తున్నారు. ప్యాకేజీ మొత్తాన్ని స్థానిక ఏజెంట్‌కు చెల్లిస్తే విమాన టికెట్లు, బస దగ్గర నుంచి వారే చూసుకుంటారు. వసతి, విందు, మందు ఉచితంగా అందించడంతోపాటు డిపాజిట్‌ చేసిన మొత్తానికి కాసినో టోకెన్లు ఇస్తున్నారని వెళ్లిన చాలామంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని స్థానిక కాసినో ప్రియుడు ఒకరు తెలిపారు. మరికొంత మంది అయితే కాసినో టేబుళ్లను కొనుగోలు చేసి లాభనష్టాలను పంచుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

అవకాశమిస్తే విశాఖలో కాసినో:
పర్యాటకులను ఆకర్షించడానికి విశాఖలో కాసినో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సెమసింఘే తెలిపారు. ఇప్పటికే నేపాల్‌లో ఏర్పాటు చేసిన కాసినోకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు