ఉజ్జెక్‌లో బతుకు బితుకు

12 Aug, 2014 01:09 IST|Sakshi
  •      వరుస దాడులతో తెలుగువారు బెంబేలు
  •      స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ ఆర్తనాదాలు
  •      స్పందించని ఏజెన్సీలు, దౌత్య కార్యాలయం
  •      తమ వెతలతో ‘సాక్షి’కి బాధితుల ఈమెయిల్
  • గాజువాక : రష్యాలో ఉపాధి కోసమంటూ వెళ్లి ఉజ్బెకిస్థాన్‌లో చిక్కుకుపోయిన కొందరు విశాఖ వాసుల సహా 250 మంది భారతీయులు వరుస దాడులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఒక కంపెనీలో అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న ఫిలిప్ఫీనీయుల కబంధహస్తాల్లో చిక్కుకొని ఆర్నెల్లుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. తట్టుకోలేక స్వదేశానికి వెళ్లిపోతామని మొర పెట్టుకున్నా తమను ఉద్యోగానికి పంపిన ఏజెన్సీగానీ, భారత దౌత్య కార్యాలయం అధికారులు కానీ స్పందించట్లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటూ ‘సాక్షి’కి ఈ మెయిల్ పంపారు.
     
    250 మంది భారతీయులు
     
    దాదాపు వంద మంది తెలుగువారు సహా 250 మంది భారతీయులు రష్యాలో ఉద్యోగం కోసమని ప్లేస్‌వెల్ హెచ్‌ఆర్డీ సర్వీసెస్ ద్వారా వెళ్లారు. విశాఖకు చెందిన ప్రజ్ఞ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా విశాఖతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందినవారు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తీరా నిర్వాహకులు రష్యాలో గాకుండా ఉజ్బెకిస్థాన్‌లోని కర్కల్ పాకిస్థాన్ జిల్లా అకలక్ ప్రాంతంలో యూజీసీసీ ప్లాంట్ ప్రాజెక్టుకు చెందిన సంగ్‌చంగ్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిర్చారు.

    అయితే అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఫిలిప్ఫీనీయులు వీరిని అడ్డగిస్తున్నారు. ఇప్పటికి ఐదారుసార్లు దాడులు చేశారని బాధితులు వాపోతున్నారు. రెండ్రోజుల క్రితం ఆరుగురు భారతీయుల ఆచూకీ లభించకుండా పోయిందని చెబుతున్నారు. రూ. 1.20 లక్షలు (2వేల యూఎస్ డాలర్లు) చొప్పున చెల్లించిన తమకు సరైన ఉద్యోగం లేకపోగా ఉజ్బెకిస్థాన్‌లో చిత్రహింసలు అనుభవిస్తున్నా మని ఈమెయిల్‌లో వెల్లడించారు.

    తాగడానికి సరిపడా మంచినీరు కూడా ఇవ్వట్లేదని, కంపెనీ కన్‌స్ట్రక్షన్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ల ముందే ఫిలిప్ఫీనీయులు తమను చితకబాదుతున్నా వారెవరూ కిమ్మనట్లేదని వాపోయారు. తామెలా ఉన్నామోనని స్వస్థలాల్లో ఉన్న తమ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారని, అధికారులు స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు. తమ సమాచారం కోసం +998912608667, +998941405802, +998941460299, +998912724395 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
     

మరిన్ని వార్తలు