వీడుతున్న చిక్కుముడులు!

30 Jun, 2019 04:08 IST|Sakshi
శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం తదితరులు

విభజన సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు

9, 10వ షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తుల పంపిణీ దిశగా కసరత్తు 

ఏపీ భవన్, విద్యుత్‌ ఉద్యోగులతోపాటు బకాయిలపై విస్తృత చర్చ 

వారంలోగా మరోసారి భేటీ కానున్న సీఎస్‌లు, సలహాదారులు  

త్వరలో ఏపీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

సాక్షి, అమరావతి: విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని పొరుగు రాష్ట్రమైన తెలంగాణాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, సలహాదారు రాజీవ్‌శర్మతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగాయి. కొన్ని అంశాల్లో ఒక రాష్ట్రానికి ప్రయోజనం, మరికొన్ని విషయాల్లో మరో రాష్ట్రానికి ప్రయోజనం కలిగి ఉండవచ్చని అయితే వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే మరో రెండేళ్లయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగానే ఉంటాయనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు.

ప్రధానంగా విభజన చట్టం 9, 10వ షెడ్యూల్‌ సంస్థల్లోని ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు సాగాయి. తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీకి సంబంధించి షీలాబిడే కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఇందులో కొన్ని సంస్థల్లో ఏపీకి, మరికొన్ని సంస్థల్లో తెలంగాణాకు ప్రయోజనం ఉంటుందని, ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్నందున తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్నేహహస్తం చాపింది. దీనిపై తెలంగాణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపిణీపై కూడా విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలపై కూడా అధికారులు చర్చించారు. 

విద్యుత్తు బకాయిలపైనా చర్చ...
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై కూడా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ఒకసారి అకౌంట్స్‌ సరిచూసిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చ సాగింది. భీష్మించుకుని కూర్చోవడం వల్ల ఫలితం ఉండదని, పరిష్కారాలు కావాలని శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్‌ తెలంగాణ విద్యుత్‌ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ఉద్యోగుల పంపిణీ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలు చేసింది. ఇది రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా ఉన్నందున ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. 

ఏపీఎండీసీ ఆస్తులు రూ.1,200 కోట్లు 
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ సంస్థఆస్తుల విభజన ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ది సంస్థ (ఏపీఎండీసీ) అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు. ఏపీఎండీసీకి సుమారు రూ. 1,200 కోట్ల ఆస్తులున్నాయి. తొమ్మిదో షెడ్యూలులో ఉన్న ఈ సంస్థ ఆస్తులను విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 52: 48 దామాషాలో పంచుకోవాలి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎండీసీకి రూ. 624 కోట్లకుపైగా వాటా రానుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కి రూ.576 కోట్లు దక్కనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో జరిగే సమావేశంలోనే ఏపీఎండీసీ విభజన ప్రక్రియ పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

విశాఖ లేదా తిరుపతిలో ఇద్దరు సీఎంల సమావేశం!
రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. వారం రోజుల్లోగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు మరోసారి సమావేశమై సమస్యల పరిష్కారానికి నాంది పలకాలని నిర్ణయించారు. సాగునీటి రంగానికి చెందిన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారం పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. జూలై 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలున్నందున ఆ లోగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విశాఖపట్టణం లేదా తిరుపతిలో సమావేశం నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు