సచివాలయం కన్నా తెలుగు విశ్వవిద్యాలయం మిన్న

3 Dec, 2013 04:53 IST|Sakshi
సచివాలయం కన్నా తెలుగు విశ్వవిద్యాలయం మిన్న

 సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాష, సాహిత్య వికాసం కోసం తెలుగు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీయమని శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ప్రశంసించారు. తన దృష్టిలో సచివాలయంకన్నా తెలుగు విశ్వవిద్యాలయమే గొప్పదని కొనియాడారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 28వ వ్యవస్థాపక దినోత్సవంసోమవారం ఘనంగా జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చక్రపాణి.. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు వర్సిటీ ప్రకటించిన విశిష్ట పురస్కారంతోపాటు రూ.లక్ష నగదు, శాలువా, జ్ఞాపికను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగు కళారూపాలు కుల, మత, ప్రాంతాల మధ్య ఉన్న అడ్డుగోడలను పెకిలిస్తాయని వ్యాఖ్యానించారు. వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఏ సంస్థకు లేని సామాజిక బాధ్యత తెలుగు విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఆశీర్వాదం, విస్తరణ సేవా విభాగం ఇన్‌చార్జి డాక్టర్ జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 పురస్కారం అందుకోవడం నా అదృష్టం: ఇనాక్
 కన్నడ, సంస్కృత, హిందీ వర్సిటీల కన్నా.. మన తెలుగు విశ్వవిద్యాలయం వంద శాతం గొప్పదని విశిష్ట పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి తర్వాత తనను వరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు