అనుభూతి కవితకు.. చెరిగిన చిరునామా

26 Jul, 2019 12:45 IST|Sakshi

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతికి గోదావరి సాహితీవేత్తల సంతాపం

ఆయన పుట్టింది మన రామచంద్రపురంలోనే..

సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి తీరంతో చెరగని చెలిమి పెనవేసుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇక లేరన్న వార్త తెలిసి తూర్పు గోదావరి జిల్లా సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలుగు కవితారంగంలో అనుభూతి కవిత్వానికి చిరునామా చెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. సాహితీరంగంలో లబ్ధప్రతిష్టుడైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మన జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలోని రత్నంపేటలో 1944 మే 29న జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రామచంద్రపురంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేశారు.

ఆయన మంచి కవి, రచయిత, మహాపండింతుడు. శ్రీకాంతశర్మ ఇక్కడే పుట్టినప్పటికీ విద్యాభ్యాసం కాకినాడ, హైదరాబాద్‌లలో జరిగింది. ఉద్యోగ ప్రస్థానం విజయవాడ, హైదరాబాద్‌ నగరాలకే పరిమితమైనా, గోదావరి ఆయన హృదయంలో తిష్ట వేసుకున్నదని చెప్పడానికి ఆయన స్వీయచరిత్రే నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఇక లేరన్న వార్తను సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని కవి పండితులు నమ్మలేకపోతున్నారు.

యానాంతో ప్రత్యేక అనుబంధం
యానాం: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటని ప్రముఖ కవి దాట్ల దేవదానంరాజు పేర్కొన్నారు. సాహిత్య సమావేశాలకు యానాం వచ్చిన ప్రతిసారీ మంచి ఆహార నియమాలు పాటించేందుకు తన ఇంటికి వచ్చి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది శిఖామణి పురస్కారం పొందిన ఆయన తన ‘కథల గోదారి’కి ‘జీవధార’ పేరుతో ముందుమాట రాసి ఆశీర్వదించారని అన్నారు. ఆయన రచించిన లలిత గీతాలు అందరినీ ఆకట్టుకుంటాయని, అలాగే ఆయన రాసిన ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా..’ అనే దేశభక్తి గీతం నేటికీ విద్యార్థుల నోట మార్మోగుతూనే ఉంటుందని అన్నారు. ఆయన రచనలు భావికవులకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

సినీగీతాల స్థాయి పెంచారు
తెలుగు సినీగీతాలకు ఒక స్థాయి, గౌరవాన్ని కలిగించిన గీతాలు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి జాలువారాయి. కృష్ణావతారం, నెలవంక, రెండుజెళ్ల సీత వంటి చిత్రాలకు ఆయన అద్భుతమైన గీతాలను అల్లారు. ఆయన తండ్రి హనుమచ్ఛాస్త్రి విద్వత్‌కవి. సతీమణి జానకీబాల కూడా చేయి తిరిగిన కవయిత్రి. 
– డాక్టర్‌ పీవీబీ సంజీవరావు, వ్యవస్థాపకుడు, తెలుగు సారస్వత పరిషత్‌

అనుభూతి ప్రేరకంగా రాసేవారు
మిత్రుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మరణంతో ఆధునిక తెలుగు కవిత్వంలో అనుభూతి వాదం చిరునామా చెరిగిపోయింది. తాను రాసింది వచన కవిత అయినా, గేయమైనా అనుభూతి ప్రేరకంగా ఉండేలా శ్రద్ధ తీసుకునేవాడు. అనేక విలువైన వ్యాసాల ద్వారా శుభ్రమైన వచన రచయితగా కూడా గుర్తింపు పొందాడు. కవిగా, కథకునిగా, నవలాకారునిగా సినీ గేయ రచయితగా, పత్రికా సంపాదకునిగా, ఆకాశవాణి ప్రయోక్తగా శ్రీకాంతశర్మ బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
– అదృష్ట దీపక్, సినీ గేయ రచయిత, కవి, విమర్శకుడు, రామచంద్రపురం

స్వీయచరిత్రలో నా పేరు ప్రస్తావించడం నా అదృష్టం
మహాకవులు మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, మల్లంపల్లి శరభేశ్వరశర్మలను కలవడానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాజమహేంద్రవరానికి వస్తూండేవారు. గౌతమీ గ్రంథాలయంపై ఆయన ఆకాశవాణిలో శబ్దప్రసారం చేశారు. ఆయన కవి, కథా, గేయ రచయిత. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి పెద్దతరానికి చెందిన విద్వత్‌కవి. ప్రాచీన కావ్యాల్లో కూడా ఇంద్రగంటికి అభినివేశం ఉండేది. ఈ విషయంలో ఆయనను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒకసారి ఆయనకు ఫోన్‌ చేశాను. ‘స్వీయచరిత్రలో మీ ప్రస్తావన గురించి రాస్తున్నప్పుడు మీరు ఫోన్‌ చేయడం ఆనందదాయకం, ఆశ్చర్యదాయకం’ అని ఆయన నాతో అన్నారు. నాతోపాటు ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్‌ నరసింహారావు పేరును కూడా ఆయన స్వీయచరిత్రలో ప్రస్తావించడం రాజమహేంద్రిపై ఆయనకుగల అభిమానానికి తార్కాణం. ఆయన రచించిన ‘శిలామురళి’ అనుభూతి కవిత్వంలో మేలుబంతి. ఆయన లేని లోటు తీరనిదే!
– సన్నిధానం నరసింహశర్మ, ప్రాణహిత కవి

బహుముఖ ప్రజ్ఞాశాలి
ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. లలిత గీతాలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, ఆకాశవాణి నాటికలు, నాటకాలు.. ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఇంద్రగంటిది అందె వేసిన చేయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కళాగౌతమి ప్రార్థిస్తోంది.
– డాక్టర్‌ బీవీఎస్‌ మూర్తి, కళాగౌతమి వ్యవస్థాపకుడు, రాజమహేంద్రవరం

మరిన్ని వార్తలు