నిప్పుల గుండం

11 May, 2019 03:25 IST|Sakshi

రాష్ట్రంలో భగభగ మండుతున్న ఎండలు

ఠారెత్తిపోతున్న ప్రజలు

47 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

బెంబేలెత్తిస్తున్న వడగాడ్పులు

వడదెబ్బతో ఈ సీజన్‌లో 100కు పైగా మరణాలు

ఒక్క శుక్రవారమే 28 మంది మృతి

పశుపక్ష్యాదులకూ గడ్డుకాలం

జాగ్రత్తలే ‘రక్ష’ అంటున్న వైద్య నిపుణులు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం/ తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): భగభగ మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అనేకచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా.. దీనికితోడు అగ్నికీలల్లా వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈసీజన్‌లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య వంద దాటినట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క శుక్రవారమే 28 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వేసవిలో ఏడుగురు వడదెబ్బ వల్ల చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం.
(చదవండి: తెలంగాణ.. నిప్పుల కొలిమి..!)


సెగలు.. సెగలు..
రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే కొద్దిసేపటికే ఒళ్లంతా చెమటతో తడిసిపోయి కళ్లు బైర్లు కమ్మి పడిపోయేలా పరిస్థితి తయారైంది.ఇళ్లల్లోనూ తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో సైతం ఏసీనో ఎయిర్‌ కూలరో లేకపోతే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్ల దగ్గర కుళాయి తిప్పితే నీరు సలసలమంటూ పొగలు కక్కుతూ వస్తోంది. రాత్రి పది పదకొండు గంటలు దాటినా ఇళ్ల పైనున్న ట్యాంకుల్లోని నీరు చల్లబడటం లేదు. కుంటలు, చెరువుల్లోని నీళ్లు కూడా కాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూరీడి ప్రతాపానికి జనమే కాదు జంతు జీవాలు, పక్షులు, జలచరాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇదేవిధంగా కొనసాగుతుందన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో 18 మండలాల్లో 44 – 47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కూడా వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సూచించింది.

వడదెబ్బకు 28 మంది మృతి
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 28 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 7 మంది, వైఎస్సార్‌ జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. 

ప్రాణాలు కోల్పోతున్న పశువులు
ఎండకు తట్టుకోలేక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వేడి నుంచి రక్షణ కోసం రైతులు తమ ఇళ్లలోని పాడిగేదెలు, ఆవులను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చల్లని నీటితో తడుపుతున్నారు. అడవుల్లో సైతం నీరు దొరక్క జంతువులు, పక్షలు అలమటిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ కొంత వరకూ జంతువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినా అవి చాలడంలేదు.

తక్షణమే చికిత్స చేయించకపోతే చావే..
పొలాల్లో ఒంటరిగా పనులు చేస్తున్నవారు, ఎండలో బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురైతే ఎవరైనా వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణతాపం వల్ల మనిషి శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల సోడియం, పొటాషియం నిల్వల్లో మార్పులు వస్తాయి. వీటి దామాషా పడిపోవడంవల్ల మనిషి శరీరం వేడిని నియంత్రించే శక్తిని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, పొటాషియం, ఇతర లవణాలు తగుమోతాదులో లేకపోవడంవల్ల మనిషి వడదెబ్బకు గురవుతారు. కాగా ప్రస్తుత వేసవిలో ఇప్పటికే వంద మందిపైగా వడదెబ్బవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటే పదుల సంఖ్యలోనే ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారితో ‘సాక్షి’ ప్రస్తావించగా.. ‘గుండె సంబంధిత సమస్యలున్న వారు వడగాడ్పులకు తట్టుకోలేరు. ఇలాంటి వారికి వెంటనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ మరణాలను అధికారులు గుండెపోటుగానే పరిగణిస్తారేగానీ వడదెబ్బ మృతులుగా గుర్తించరు. అందువల్లే వడదెబ్బ మరణాల నిర్ధారించే ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది’ అని వివరించారు. గుండె సమస్యలున్న వారు వీలైనంత వరకు ఎండలో బయట తిరగరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్థి తెలిపారు.

వడదెబ్బ లక్షణాలు
- రోజుకు ఐదారుసార్లు కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. 
- జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం.
- అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక పిడచగట్టుకుపోయినట్లు తడారిపోవడం.
- పాక్షిక లేదా పూర్తి ఆపస్మారకస్థితిలోకి వెల్లడం.
- పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు ఎక్కువ వేడిగా ఉండటం.
వడదెబ్బ తగిలితే ఈ లక్షణాలన్నీ ఉండాలని కాదు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. 
వడదెబ్బకు గురైన వారిని బాగా గాలి తగిలేలా నీడలో పరుండబెట్టి చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరమంతా తుడవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం కలుగుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం
మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ కపర్థి సూచించారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
– ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధ్యమైనంత వరకూ ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. 
– తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంతోపాటు హృదయ భాగంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. 
– శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న తెలుపు లేదా లేత రంగు కాటన్‌ దుస్తులు ధరించాలి. 
– రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. ప్రతి అరగంటకొకసారి నీరు తాగుతూ ఉండాలి.
– ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మ రసం, ఉప్పు కలిపిన చల్లని నీరు లేదా, మజ్జిగ, కొబ్బరి నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది.
– ఎలక్ట్రాల్‌ పౌడర్‌ దగ్గర ఉంచుకుని ఏమాత్రం బడలికగా ఉన్నా నీటిలో కలుపుకుని తాగాలి. దీనివల్ల చెమట రూపంలో వెళ్లిన లవణాల స్థానే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి.
– చివరి అంతస్తుల్లో ఉన్న ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. కిటికీలకు వట్టి వేళ్లు, గోనెసంచులు వేసి వాటికి నీరు చల్లడం ద్వారా కొంత వరకూ గది వేడిని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి.

రానున్న 5 రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వివిధ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
మే 11వ తేదీ:
46 – 47 డిగ్రీలు – ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
43 – 45 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ అనంతపురంలలో కొన్ని ప్రదేశాలు
39 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
మే 12వ తేదీ: 
45 – 46 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
42 – 44 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
39 – 41 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
మే 13వ తేదీ:
43 – 44 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
38 – 40 డిగ్రీలు – విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
మే 14వ తేదీ: 
43 – 44 డిగ్రీలు – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
41 – 42 డిగ్రీలు – ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
37 – 39 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
మే 15వ తేదీ: 
43 – 44 డిగ్రీలు – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు
38 – 39 డిగ్రీలు – విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రదేశాలు

వడగాడ్పులు.. వర్షాలు
రాష్ట్రంలో విభిన్న వాతావరణం
రాష్ట్రంలో ఒకపక్క వడగాడ్పులు, మరోపక్క తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోపక్క ఒడిశా నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

మరిన్ని వార్తలు