భానుడు భగభగ

20 Aug, 2014 02:12 IST|Sakshi

కర్నూలు (జిల్లాపరిషత్) : జిల్లాలో వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సుమారు నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో.. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం నుంచి రోజురోజుకూ  వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం 38.8 భానుడు భగభగ డిగ్రీలు నమోదైంది. జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తున్నా.. ఉక్కపోత మరింత పెరుగుతోంది.

 గత యేడాదితో పోలిస్తే ఈ నెలలో జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరగడం, గాలిలో తేమ తగ్గిపోవడంతో ఉక్కపోత అధికమైంది. పగలు, రాత్రి వేళల్లోనూ జనం ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితేమిటని జనం ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎండాకాలమే కొనసాగుతోందని, ఇది రెండో వేసవికాలమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజులుగా అధిక శాతం ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అవసరమైతే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక శాతం నీరు, మజ్జిగ తాగాలని, గొడుగు, టోపీలు వాడాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు