‘అన్ని దేవాలయాలకు ఒకటే వెబ్‌సైట్‌’

24 Dec, 2019 14:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఈ ఏడాది భవానీ దీక్షా విరమణలకు  అరు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ ఈవో సురేష్‌ బాబు తెలిపారు. 13 లక్షల 39 వేల లడ్డూలను భవానీలకు విక్రయించామని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చీరలు,‌ లడ్డూ ప్రసాదాల ద్వారా అమ్మవారికి 2 కోట్ల 53 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఇరుముడుల ద్వారా వచ్చిన సామాగ్రికి 26 న ఆక్షన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆక్షన్లో ఎవరైనా పాల్గొనవచ్చని, ప్రతీ మంగళవారం వృద్ధాశ్రమాలకు భోజన అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నవృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ నెల 26 న సూర్యగ్రహణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నామన్నారు. రేపు(డిసెంబర్‌ 25) రాత్రి 9  గంటల 30 నిముషాలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తున్నామని అన్నారు.  తిరిగి 26 సాయంత్రం అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం  దుర్గమ్మ ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా నకిలీ వెబ్ సైట్లపై ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాయాలకు ఒకటే వెబ్ సైట్ ఉండాలని ప్లాన్‌ చేస్తున్నామని, జనవరి 8 న అన్ని దేవాలయాల ఈవోలతో దేవాదాయ శాఖ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇకపై దుర్గమ్మ దర్శనం కోసం ముందుగానే అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు భక్తులకు కల్పిస్తున్నామని  ఈ  ప్రక్రియ ఉగాది నాటికి అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు