క్షీరారామలింగేశ్వరస్వామి భూముల్లో అక్రమ తవ్వకాలు

27 Jun, 2019 10:53 IST|Sakshi
దేవస్థానం భూమిలో పొక్లెయిన్‌తో మట్టి తవ్వుతున్న దృశ్యం 

సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): భూమి యజమాని తన స్థలంలో మట్టిని  తవ్వుకోవాలన్నా అధికారుల అనుమతులు తప్పనిసరి. అలాంటిది దేవస్థానం భూమిని కౌలుకు తీసుకున్న ఓ కౌలు రైతు ఆ భూమిలో మట్టిని దర్జాగా బయటకు తరలించేస్తుండటం గమనార్హం. పంచారామక్షేత్రాల్లో ప్రసిద్ధి గాంచిన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం భూమి అనేక చోట్ల ఉంది. స్వామివారి పేరున సుమారు 57.30 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు ఆరు ఎకరాలు సబ్బేవారి పేట శివారు ప్రాంతంలో ఉంది. దానిని ఓ రైతు కౌలుకు పాడుకున్నాడు. ఇంకా సంవత్సరంన్నర కౌలు గడువు ఉన్నట్లు సమాచారం.

ఈ ఆరు ఎకరాల్లో మట్టిని నాలుగు రోజుల నుంచి తవ్వేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుని భూమిని కౌలుకు తీసుకుని పంటను పండించుకోవాలి గాని ఇలా మట్టి అమ్మేసుకుంటారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం మట్టిని తవ్వుతుండగా దేవస్థానం సిబ్భంది వచ్చి రైతును హెచ్చరించి వెళ్లారని వారు వెళ్లిన తరువాత మళ్లీ తవ్వడం మొదలు పెట్టాడని స్థానికులు తెలిపారు. కాని రెండోసారి దేవస్థానం అధికారులు గాని సిబ్బంది గాని ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని చెబుతున్నారు. 

రూ. ఏడు లక్షలు స్వాహా
ఎకరాకు సుమారు 300 నుంచి 350 ట్రాక్టర్ల చొప్పున సుమారు నాలుగు ఎకరాల్లో సుమారు  1200 నుంచి 1400 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించినట్టు సమాచారం. ఒక్కో ట్రాక్టర్‌ మట్టి రూ.500 వరకూ విక్రయిస్తున్నారు. అంటే సుమారు ఇప్పటి వరకు రూ. ఏడు లక్షల వరకు మట్టిని స్వాహా చేసేశారు. దీనిపై దేవస్థానం అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

మట్టి తవ్వాలంటే అనుమతులు ఉండాలి
ఏభూమిలో అయినా మట్టిని తవ్వాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. భూమి వివరాలతో పాటు మట్టిని ఎందుకు విక్రయిస్తున్నారో తెలిపే విదంగా ఒక దరఖాస్తును తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలి. దానిని మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు సిఫార్సు చేస్తాం. దాంతో మైనింగ్‌ సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది కలిసి భూమిని సర్వే చేసి ఎన్ని క్యూబిక్‌ మీటర్లు తవ్వాలో అంచనాలు వేస్తారు. అంచనాలు వేసిన క్యూబిక్‌ మీటర్లకు సీనరేజి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిలో మట్టి తవ్వకానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.
– ఎస్‌. నరసింహారావు, తహసీల్దార్, పాలకొల్లు              

మరిన్ని వార్తలు