ఆలయ భూమి కబ్జా

14 Jan, 2019 09:35 IST|Sakshi
కొత్తచెరువులో శివాలయం గేట్లను పగలుకొట్టిన టీడీపీ నాయకులు

టీడీపీ ఎంపీపీ భర్త దౌర్జన్యం

రాత్రిరాత్రికే జేసీబీతో

శివాలయం గేట్ల తొలగింపు

అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు దేవాదాయ భూములపైకన్నేశారు. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ ఆక్రమించేస్తున్నారు. మండల కేంద్రం కొత్తచెరువులోని సత్యసాయి ప్రభుత్వ జూనియర్‌కళాశాల వెనుక ఉన్న వేణుగోపాలస్వామి మాన్యం భూమిలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. దేవాదాయ భూమిలో పట్టాలిచ్చిన స్థలాలు సైతం ఆక్రమణకుగురయ్యాయి. వీటిపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. అధికారుల నుంచి నివేదిక రాకుండానే, ఇంటి స్థలాల ఆక్రమణలు మరువకముందేబీసీ కాలనీలోని శివాలయం గేట్లనుశనివారం రాత్రి జేసీబీలతోతొలగించారు.

అనంతపురం, కొత్తచెరువు: కొత్తచెరువులోని బీసీ కాలనీకి చెందిన నాగన్న 2010లో కాలనీలోని కొండ ప్రాంతంలో ఉన్న భూమిని చదును చేసుకుని శివాలయం నిర్మించాడు. ఆలయ నిర్మాణం కోసం తనకున్న ఐదు ఎకరాల భూమి అమ్ముకున్నాడు. 2014లో కాశీ నుంచి శివుడి విగ్రహం తెచ్చి ఆలయంలో ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తూ అర్చకునిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు 2018 ఏప్రిల్‌లో సర్వేనంబర్‌ 483లో అప్పటి తహసీల్దార్‌ వసంతకుమార్‌ శివాలయానికి 50 సెంట్లు కేటాయించారు. అప్పటి నుంచి అర్చకుడు నాగన్న గుడిని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. వారం రోజుల క్రితం సాలక్కగారి శ్రీనివాసులు అనుచరునిగా ఉన్న పెద్దన్న వచ్చి గుడి ప్రాంతంలో జేసీబీతో కొండను తొలుస్తూ మట్టిని ట్రాక్టర్ల ద్వారా బయటకు తోలాడు. అప్పుడు అర్చకుడు అడ్డు తగలడంతో వెనక్కు తగ్గాడు. 

రాత్రికి రాత్రే గేటు కూల్చివేత..
శనివారం రాత్రికి రాత్రే జేసీబీతో పది మంది వ్యక్తులు వచ్చి శివాలయం గేటును పగులగొట్టారని అర్చకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత అర్చకుడు నేరుగా టీడీపీ ఎంపీపీ వాణి భర్త శ్రీనివాసులును సంప్రదించగా ‘గేట్లను నేనే పగులగొట్టించా.. నీకు దిక్కున్న చోట చెప్పుకో..రూ.3 లక్షలు డబ్బులిస్తా. శివాలయం కూడా ఖాళీ చేసి వెళ్లు’ అంటూ బెదిరించాడు. ఇప్పటికైనా ఆలయ భూమిని కాపాడాలని, లేకుంటే ఇక్కడా ప్లాట్లు వేసి అమ్ముకుంటారని అర్చకుడు తెలిపాడు. 

మరిన్ని వార్తలు