-

ఇదేమి ’హనుమంతా’..

23 Feb, 2019 07:43 IST|Sakshi
ఖాళీగా వదిలిన గడులతో పాటు, ఈనెల 25 వరకు సంతకాలు చేసిన పట్టిక

శ్రీవారి దేవస్థానంలో వింత

ఉద్యోగం చేయకుండానే అటెండెన్స్‌లో సంతకాలు

ఈ నెల 25వ తేదీన కూడా ఉద్యోగం చేశారట

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: ఇదేమి హనుమంతా.. ఇంకా ఈనెల 25వ తేదీ రాలేదుగా.. మరెలా ఉద్యోగం చేశావు. నీవు చేసే మాయాజాలంలో ఇదో కోణమంటావా.. అవన్నీ పక్కనబెట్టి అడిగేవారు లేరు కదా.. అంతా నా ఇష్టం అంటావా. ఏది ఏమైనా గడవని రోజుల్లో కూడా ఉద్యోగం చేసినట్లు అటెండెన్స్‌ పట్టికలో చూపడం మీకే చెల్లిందేమో..

అటెండెన్స్‌ మాయాజాలం
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొంత మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండానే జీతాలు అందుకుంటున్నారు. సెలవు పెట్టిన తేదీలకు సంబంధించి, అటెండెన్స్‌ పట్టికలోని గడుల్లో ముందు చుక్కలు పెడుతున్నారు. మళ్లీ విధులకు రాగానే ఆ చుక్కలను సంతకాలుగా మార్చేస్తున్నారు. రేపటి సంతకాలను సైతం ఈ రోజే పెట్టేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఇక చెప్పనక్కర్లేదు. ఇలా ఉద్యోగాలు చేయకుండానే చేసినట్లు అటెండెన్స్‌లో చూపి, పూర్తి జీతాలను అందుకుంటూ, ఆ చినవెంకన్న సొమ్ముకు శఠగోపం పెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకు కొందరు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది చేసేవారు. అయితే ఇప్పుడు రెగ్యులర్‌ సిబ్బంది సైతం ఇదే బాణీని అవలంబిస్తున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన ద్వారా తేటతెల్లమైంది.

అసలు జరిగిందేమిటంటే
శ్రీవారి ఆలయంలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన అటెండెన్స్‌లో సిబ్బంది చేస్తున్న మాయాజాలాన్ని బట్టబయలు చేసింది. ఆధ్యాత్మిక గ్రంథాలయ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న ఆర్‌.హనుమంతాచార్యులు ఈనెల 11 నుంచి 16 వరకు తనకు సంబంధించిన అటెండెన్స్‌ పట్టికలోని గడుల్లో సంతకాలు పెట్టలేదు. అయితే శుక్రవారం ఖాళీ గడుల్లో సంతకాలు పెట్టిన ఆయన, అంతటితో ఆగకుండా ఈనెల 25 వరకు విధులు నిర్వర్తించినట్లు సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు బహిర్గతం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

పర్యవేక్షణాలోపమే కారణం
విధులకు హాజరైన ఆలయ సిబ్బంది నిత్యం అటెండెన్స్‌ పట్టికలో, తేదీకి సంబంధించిన గడిలో సంతకం చేయాలి. ఒక వేళ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా క్యాంపునకు వెళితే ‘ఓ.డి’ అని చూపాలి. అదే సెలవు గనుక పెడితే ’ఎల్‌’ అని రాయాలి. ఒక వేళ ఉద్యోగి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైతే ఆబ్సెంట్‌ చూపి, అతనిపై చర్యలు తీసుకోవాలి. ఏ విభాగానికి సంబంధించిన అధికారి, ఆ విభాగ అటెండెన్స్‌ పట్టికను ప్రతి రోజు క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఇక్కడ అవేమీ జరగడం లేదు. ఉద్యోగి సెలవులు పెట్టిన రోజుల్లో సైతం, విధులు నిర్వర్తించినట్లుగా అటెండెన్స్‌ పట్టికలో చూపుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు