దొంగలు బాబోయ్‌..దొంగలు!

30 Jul, 2018 10:19 IST|Sakshi
పంచలోహ విగ్రహాలు మాయమైంది ఇక్కడే, కూచిపూడి ఆలయ ఆవరణంలో గుప్త నిధులకోసం తవ్వకాలు

మర్రిపూడి: ప్రకాశం జిల్లాలో దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్రామ శివారు పురాతన ఆలయాలు, నూతనంగా నిర్మించిన ఆలయాలను దొంగలు టార్గెట్‌ చేస్తున్నారు. ఎన్నిసార్లు దొంగతనం చేసినా పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడంలో దొంగలు డిగ్రీ పొందారేమోనని ఆయా గ్రామాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. చైన్‌స్నాచర్‌లు, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ, విగ్రహాల దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసు శాఖను ముప్పుతిప్పలు పెడతున్నారు.

దొంగల ఆచూకీ తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిర్మాపురం గ్రామ శివారులో ఈ ఏడాది ఏప్రిల్‌ 5న అభయాంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న సిమెంట్‌ కిటికీ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించి హుండీ పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేలు అపహరించుకెళ్లారు. గతేడాది అంకేపల్లి గ్రామ శివారులో ఉన్న అమ్మవారి గుడి తాళాలు పగులగొట్టి హుండీలోని నగదు మాయం చేశారు. మర్రిపూడి పురాతన శివాలంలో ఈ నెల 26వ తేదీ రాత్రి దొంగలు పడి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 5 పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. తంగెళ్ల శివాలయం, పృధులగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం విగ్రహాల కింద తవ్వకాలు జరిపారు.

గుండ్లసముద్రం పంచాయతీ పరిధిలోని కొష్టాలపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు పడటంతో నగదు చోరీకి గురైంది. తాజాగా కూచిపూడి అండ్ర రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. రూ.లక్షలకు లక్షలు వెచ్చించి ఆలయాలు నిర్మించుకున్న భక్తులు స్వాముల వారికి కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆలయాల్లో ఉండే హుండీలపై దొంగల కన్నుపడుతోంది. సులవుగా ధనార్జన చేయాలని దొంగలు ఏదో ఒక ప్రదేశంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

కేసులు ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏడాది వ్యవధిలో దాదాపు 17 దొంగతనాలు జరిగాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. స్వాముల వారి సొమ్ము కాజేస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. ఆయా గ్రామాల భక్తులు ఏం చేయాలో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. స్వాముల వారి సొత్తు కాపాడే నాథుడేలేరా? అని వాసులు ప్రశ్నిస్తున్నారు. దేవుని సొమ్ము తిన్నోళ్లు నాశనమైపోతారని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.

 
సీసీ కెమెరాలు అమర్చాలి
మర్రిపూడి పంచాయతీ పరిధిలోని రాజుపాలెంలో అభయాంజనేయస్వామి ఆలయం హుండీ పగులగొట్టి నగదు తీసుకెళ్లారు. గార్లపేటలో కూడా ఇలాగే జరిగింది. ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు విమర్మిస్తున్నారు. పలు ముఖ్య ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చి దొంగల భరతం పట్టాలని కోరుతున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు