హర హర మహాదేవ శంభో శంకర 

22 Feb, 2020 04:36 IST|Sakshi
విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటుచేసిన కోటి లింగాలు

మహా శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా అభిషేక పూజలు

వైభవంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవ కల్యాణం

ప్రభల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయిన కోటప్పకొండ

విశాఖ సాగర తీరాన కోటి లింగాలకు మహా కుంభాభిషేకం  

సాక్షి, నెట్‌వర్క్‌: హర హర మహాదేవ శంభో శంకర నామస్మరణతో రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు పులకించాయి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. దక్షిణ కైలాసంగా పేరొందిన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్త జనం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామివారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై పట్టణంలోని నాలుగుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శనివారం మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవం నిర్వహణకు స్వామివారి రథాన్ని సిద్ధంగా ఉంచారు. ఆలయంలో అడుగడుగునా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. 

వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవ కల్యాణం 
శ్రీశైలంలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి పర్వదిన ఘడియలు ప్రారంభం కాగానే శ్రీమల్లికార్జునస్వామిని వరుడిగా తీర్చిదిద్దే పాగాలంకరణ మొదలైంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 11 మంది రుత్వికులు స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. 

శివనామస్మరణతో హోరెత్తిన సాగరతీరం 
సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షణలో కోటి లింగాలకు పూజలు నిర్వహించారు. 

విశాఖ ఆర్కే బీచ్‌లో కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్న సుబ్బరామిరెడ్డి, స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర   

వైభవంగా కోటప్పకొండ తిరునాళ్లు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన విద్యుత్‌ ప్రభల కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగిపోయింది. 
రామతీర్థంలో శివనామ స్మరణ 
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవ దేవాలయం అయినప్పటికీ ఏటా శివరాత్రికి లక్షలాది మంది భక్తులు హాజరై పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సాక్షాత్తూ శ్రీరాముడే రామ క్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ
బద్ధంగా నృత్యాలు చేశారు.  

మరిన్ని వార్తలు