‘అనకాపల్లి’లోనే తాత్కాలిక పాలన...!

1 Aug, 2013 03:40 IST|Sakshi

అనకాపల్లి, న్యూస్‌లైన్: గ్రేటర్ విశాఖలో విలీనమైన అనకాపల్లి పట్టణం లో జోనల్ కార్యాలయం పూర్తిస్థాయి సిబ్బందితో నెల రోజుల్లో పని చేయ డం మొదలవుతుందని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన ప్రస్తుత కమిషనర్ మురళీధరరావుతో కలిసి  ఆస్తుల డాక్యుమెంట్ల స్వాధీనంపై నియమిం చిన బృందంతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీన ఉత్తర్వులు వచ్చిన తక్షణమే గ్రేటర్ విశాఖ పాలన మొదలైందన్నారు. ఇప్పటివరకు జీవీఎంసీ జనాభా 17 లక్షలుండగా అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, 10 పంచాయతీల విలీనంతో 19 లక్షలకు చేరుకుందని చెప్పారు. ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నామని, అధికారులు ఎలా వ్యవహరించాలో సూచనలు అందిస్తున్నామన్నారు. విలీన ప్రాంతాలతో కలిపి వార్డుల విభజన ఉంటుందని, ప్రస్తుతం ఉన్న 72 వార్డులు ఇకపై 81 వార్డుల వరకు పెరగవచ్చని తెలిపారు. మూడు నెలల్లో వార్డుల విభజన చేస్తామన్నారు.
 
 అనకాపల్లి జోనల్‌లో పనిచేసే సిబ్బంది అభీష్టం మేరకు గ్రేటర్ విశాఖలో ఉండాలా లేక మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్లాలా? అన్నది వారికే వదిలేస్తామన్నారు. సిటిజన్ చార్ట్ ప్రకారం సమస్యల పరిష్కారానికి ఒక సహాయ కేంద్రం ఏర్పా టు చేసే ప్రతిపాదన ఉందని చెప్పారు. దరఖాస్తుదారునికి ఎస్‌ఎంఎస్ ద్వారా సదుపాయాల వివరాలను తెలియజేస్తామన్నారు. అనకాపల్లి మున్సిపాలిటీ నుంచి సుమారు రూ.7 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశముందన్నారు. అనకాపల్లిలో మంచినీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్య పనుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పూర్తి స్థాయి సిబ్బంది వచ్చే వరకు అదనపు కమిషనర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలోని బృందం ఇక్కడ కమిషనర్‌కు సూచనలు, సలహాలు ఇస్తుందని తెలిపారు.
 
 వినతుల విన్న కమిషనర్..
 అనకాపల్లిలో ఆస్తి పన్ను వసూలు కేంద్రం వద్ద సర్వర్ డౌన్ అయిన విషయాన్ని వినియోగదారులు కమిషనర్ వద్ద ప్రస్తావించగా త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటివరకు 010 పద్ధతిలో జీతాలు అందిస్తున్నట్లే జీవీఎంసీలో విలీనమయ్యాక కూడా అందించాలని ఉపాధ్యాయులు కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు