ఉన్నపళంగా తరలింపు తగదు

23 Sep, 2014 00:18 IST|Sakshi
ఉన్నపళంగా తరలింపు తగదు

ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు
మంత్రులు చెట్ల కింద పనిచేస్తే ఉద్యోగులూ సిద్ధం
ఒత్తిడి వల్ల లాభం కంటే ఇబ్బందులే ఎక్కువ


విజయవాడ బ్యూరో: తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ దశలవారీగా జరగాలే తప్పా ఇప్పటికిప్పుడే హైదరాబాద్ నుంచి తరలించే యత్నం సరికాదని ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. తాత్కాలిక రాజధానికి  తక్షణం వెళ్లిపోవాలంటే.. మంత్రులు, ఐఏఎస్‌లు చె ట్ల కింద కూర్చుని పనిచేస్తే తామూ పనిచేస్తామన్నారు. విజయవాడ ఏపీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న అనేక అంశాలను మంగళవారం సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా తాత్కాలిక రాజధానిని నిర్మించుకుని, ప్రజలకు తక్షణ అవసరమైన  శాఖలను దశలవారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.రాజధాని స్వరూప స్వభావాలు, పరిపాలనపై ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాలని డిమాండ్ చేశారు.

హెల్త్‌కార్డులపై నేడు సీఎం సమావేశం..

ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించే అంశాన్ని చర్చించేందుకు మంగళవారం సీఎం నిర్వహించే సమావేశంలో ఆ పథకం అమలులో లోపాలను చర్చించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను  ఆయన దృష్టికి తెస్తామని అశోక్‌బాబు చెప్పారు

మరిన్ని వార్తలు