-

ఇక వరుణుడి వంతు

14 May, 2019 05:12 IST|Sakshi

రెండు, మూడు రోజులపాటు వర్షాలు

సాధారణ స్థితికి ఉష్ణోగ్రతలు

సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్లుగా భగభగ మండు తున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే, అకాల వర్షాల రూపంలో వరుణుడు ప్రతాపం చూపనున్నాడు. పిడుగుల వర్షాన్ని కురిపించ నున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రెండు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తాంధ్రలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. ఇదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం పలుచోట్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా కర్నూలులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు మాత్రమే ఎక్కువ. ఇదిలావుండగా.. సోమవారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు.

మరిన్ని వార్తలు