లాక్‌డౌన్‌: పుత్తూరు కట్టుకు విశ్రాంతి

12 Apr, 2020 10:44 IST|Sakshi
పుత్తూరు శల్యవైద్యశాలలో సేవలు అందుకుంటున్న రోగులు ( ఫైల్‌ ) , ఎన్‌టీఆర్‌కు చికిత్స చేస్తున్న పుత్తూరు శల్య వైద్యులు (ఫైల్‌)

ఆకుపసరు.. వెదురు దబ్బలతో విరిగిన ఎముకలకు కట్లు కట్టే పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా వందలాది మంది రోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన పుత్తూరు కట్టుకు గతంలో ఎన్నడూ ఇలాంటి అవరోధం  కలగలేదు.

సాక్షి, పుత్తూరు: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలిక విరామం వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాళెంలో శతాబ్ద కాలంగా శల్యవైద్యశాల ద్వారా విరిగిన ఎముకులకు ఆకు పసురుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే పుత్తూరు కట్టుగా వాసికెక్కింది. సినీ రాజకీయ ప్రముఖుడు ఎన్టీఆర్‌ మూడుసార్లు ఇక్కడ చికిత్స చేయించుకున్నారు.  పల్లెటూరి పిల్ల, సర్దార్‌ పాపారాయుడు సినిమాల చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడగా.. ఆయనకు పుత్తూరు కట్టు కట్టి సమస్యను పరిష్కరించారు. మాజీ ఉప రాష్ట్రపతి వీవీ గిరి, హీరో కృష్ణంరాజుకు కూడా పుత్తూరు శల్యవైద్యులు సేవలు అందించారు. కొంత కాలం క్రితం ప్రముఖ వైద్య సంస్థల అధినేత డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డికి కూడా సేవలు అందించారు.

సగటున రోజూ సుమారు 300 మంది రోగులు  చికిత్స కోసం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు వైద్యులు, 50 మంది సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడి వైద్యులు తిరువనంతపురం, బెంగళూరు, ముంబయి తదితర నగరాలకు నెలకు ఒకసారి వెళ్లి సేవలు అందిస్తున్నట్లు డాక్టర్‌ సూరపరాజు ప్రతాప్‌ రాజు తెలిపారు. కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి శల్యవైద్యశాలను మూసివేశారు. ప్రజారవాణాతో పాటు ఇతర రవాణా మార్గాలు మూతబడడంతో రోగుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత తిరిగి ఆస్పత్రిలో వైద్య సేవలను పునరుద్ధరించనున్నారు. 

కరోనా నియంత్రణలో భాగంగా..
రోగులతో పాటు వారి బంధువులు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది రోజూ ఆçస్పత్రికి వస్తుంటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఆçస్పత్రిని మూసివేశాం.  లాక్‌డౌన్‌ తరువాత పూర్తిస్థాయిలో రోగులకు చికిత్స అందిస్తాం. పరిస్థితిని రోగులు అర్థం చేసుకుని, సహకరించాలి. 
– డాక్టర్‌ కృష్ణంరాజు, శల్యవైద్యులు, పుత్తూరు

మరిన్ని వార్తలు