ఓ మనిషా..!

4 Jan, 2019 06:57 IST|Sakshi

ని‘మి’షాల్లోనే.. తెగ ‘తాగేశారు’

మద్యం ఏరులై పారింది

డిసెంబర్‌ 31 మద్యం అమ్మకాలు రూ.10 కోట్లు

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ‘చలిగాలులు తీవ్రంగా వీస్తూ గడ్డ కట్టిస్తుంటే.. మందు బాబులు వేడివేడి బిర్యానీతో మందుకొడుతూ చిందులేశారు. మందుషాపులు, బార్‌లు బార్లా తెరిచేయటంతో పెగ్గుమీద పెగ్గు వేస్తూ.. బీర్లు మీద బీర్లు పొంగిస్తూ తెగ ‘తాగేశారు’ .. అనుభవించు రాజా అంటూ ఫుల్‌గా ఎంజాయ్‌చేశారు. జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాల్లో జనం నిషాలో తేలియాడారు.

ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రోత్సహించడంతో మద్యం ప్రియులు రాత్రీపగలూ తేడా తెలియని స్థితిలో మందులో మునిగితేలారు. జిల్లాలో మందు బాబుల జోరు మరింత పెరిగింది. 2018 సంవత్సరంలో ఏకంగా జిల్లాలో రూ. 1,306 కోట్ల మేర మద్యం తాగేస్తే.. ఒక్క డిసెంబర్‌లోనే రూ.162.59 కోట్ల మేర గుటకేశారు. 2017 సంవత్సరంలో  రూ.1154.82కోట్లు మేర మందు తాగేస్తే... ఆ  ఏడాది ఒక్క డిసెంబర్‌లోనే రూ.157 కోట్లు కడుపులో పోశారు. 2017 డిసెం బర్‌ 31వ తేదీ  జిల్లాలో రూ.6.70 కోట్ల మేర మద్యం అమ్మకాలు చేయగా,  2018 డిసెంబర్‌ 31 ఒక్కరోజే మందుబాబుల నిషా విలువ రూ.10 కోట్లకు చేరింది. జిల్లాలోని ఏలూరు నగరంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ మందుబాబులు బార్ల వద్ద బారులు తీరారు. భారీస్థాయిలో మద్యం అమ్మకాలుజరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒకవైపు వ్యాపారుల దోపిడీతో జేబులకు చిల్లులు పడుతున్నా.. మద్యం ప్రియులకు కిక్కుపై మక్కువ తగ్గటంలేదు. ఏలూరు నగరంతోపాటు పట్టణాల్లోనూ భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 474 మద్యం దుకాణాలు ఉండగా, 39బార్లు ఉన్నాయి. వీటికి తోడు బెల్టు షాపులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. 2018 డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్కనెలలోనే లక్షా 64 వేల కేసుల బీర్లు,  3.29 లక్షల కేసుల వివిధ బ్రాండ్ల మద్యం విక్రయాలు చేశారు. ఈ మద్యం విలువ రూ.162.59 కోట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇక 2017 డిసెంబర్‌లో లక్షా 43 వేల కేసుల బీర్లు,  3.35 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. వీటి విలువ రూ.157.61 కోట్లు ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే మద్యం బాటిళ్ళ కొనుగోలు స్వల్పంగా 2 శాతం తగ్గితే, బీర్ల విక్రయాలు ఏకంగా 14 శాతం పెరగటం విశేషం.

2018 డిసెంబర్‌ 31వ తేదీ మద్యం విక్రయాలు
జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్‌ డివిజన్ల పరిధిలో మందు ఏరులైపారింది. రోజూ రూ.60 వేల కౌంటర్‌ ఉండే మద్యం దుకా ణాల్లోనూ కొత్త సంవత్సర సంబరాల సందర్భంగా ఏకంగా రూ.2 లక్షలకుపైగా మందు విక్రయాలు జరిగాయి. బాగా రద్దీగా ఉండే షాపుల విషయానికి వస్తే ఆ రోజు రూ.3 లక్షల వరకూ అమ్మకాలు చేసినట్లు చెబుతున్నారు.  ఒక్కరోజులోనే జిల్లాలో రూ.10 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఏలూరు డివిజన్‌లో రూ.5.45 కోట్లు, భీమవరం డివిజన్‌లో రూ.4.55 కోట్లు మేర విక్రయాలు జరి గినట్లు తెలుస్తోంది. ఏలూరు డివిజన్‌లో 9,712 లిక్కర్‌ కేసులు అమ్ముడైతే, 2 వేల కేసుల బీర్లు తాగేశారని అంచనా. ఇక భీమవరం డివిజన్‌లో 12వేలకు పైగా మద్యం బాటిళ్లు సేల్‌ అవ్వగా, 896 కేసుల బీర్లు చల్లగా తాగేశారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులోనే మద్యం 19, 100 కేసులు, బీర్లు 12,312 కేసులు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.

అమ్మకాల్లో పెరుగుదల
జిల్లాలో మద్యం దుకాణాలకు తెగ డిమాండ్‌ పెరిగిపోయింది. మద్యం దుకాణాల యజమానులు తమకు లాభాలు రావటంలేదని ప్రభుత్వంపై నిరసన తెలి పారు. కానీ మద్యం అమ్మకాలు, ఆదాయం మాత్రం గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.  రెండేళ్ల లెక్కలు పరిశీలిస్తే మద్యం అమ్మకాల్లో 6శాతం, బీర్ల విక్రయాల్లో 12శాతం పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు