జిల్లాలో 10 డెంగీ కేసుల నమోదు

12 Jul, 2018 11:52 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి

తెర్లాం: జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం తెర్లాం పీహెచ్‌సీకి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో రెండు మొబైల్‌ మలేరియా, డెంగీ క్లినిక్‌ (ఎంఎండీసీ) వాహనాలు తిరుగుతున్నాయన్నారు.

ఈ వాహనాల్లో దోమల నివారణకు అవసరమైన మందులు వీధి కాలువల్లో పిచికారీ చేయడం, వైద్య సేవలు అందిస్తామన్నారు. జూలై 1 నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు జిల్లాలో ఎంఎండీసీ వాహనాలు తిరుగుతాయన్నారు. డెంగీ కేసుల నిర్ధారించడం కేవలం జిల్లా కేంద్రాస్పత్రిలోనే జరగుతుందన్నారు.

జ్వరంతో బాధపడేవారికి ఫ్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిపోయిన వెంటనే డెంగీగా భావించొద్దని, జ్వరంతో బాధపడేవారికి ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిపోతే, తిరిగి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఫ్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నెల్లిమర్ల మండలం కొండవెలగాడ పీహెచ్‌సీకి మాత్రమే సొంత భవనం లేదని, మిగతా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 431 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, వీటిలో 135 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగతావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. సొంత భవనాల నిర్మాణానికి తహసీల్దార్లు స్థలాలు మంజూరు చేస్తే, భవన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తానన్నారు.

21 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ

జిల్లాలో 21 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. 44 సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సిరంజ్‌ల కొరత ఉన్నట్లయితే ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ప్రస్తుతానికి మందుల కొరతలేదన్నారు.

బీపీ మాత్రలు కావాలని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్యాధికారుల నుంచి ఇండెంట్‌ వచ్చిన వెంటనే సరఫరా చేస్తామన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రెడ్డి రవికుమార్‌ను ఆదేశించారు. తెర్లాంకు 108 వాహనం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 

మరిన్ని వార్తలు