లక్ష్యానికి పది సూత్రాలు : సత్య నాదెళ్ల

30 Sep, 2014 02:33 IST|Sakshi
లక్ష్యానికి పది సూత్రాలు :సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల... ఈ పేరు తాజాగా ప్రపంచమే స్మరిస్తోంది. కలలు కనడమే కాదు... ఆ కలలను సాకారం చేసుకుని తన జీవన మార్గాన్ని సుసంపన్నం చేసుకున్నారాయన. లక్షలాది యువతకు దిక్సూచిలా నిలిచారు. ఆ.. ఇంజినీరింగే కదా... అని తేలికగా తీసుకుంటున్న సమయంలో అబ్బో.. ఇంజినీరింగా అనే స్థారుుకి తీసుకువెళ్లారు.

ఏడాదికి 112 కోట్ల వేతనంతో  అగ్రగామిగా నిలిచారు. మనజిల్లాలో 18 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో నుంచి ఏటా 10 వేల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. ఈ అకడమిక్ సంవత్సరంలో 40 వేల మంది ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల జీవితాన్ని ఓ పాఠంగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే విద్యార్థుల కోసం పది సూత్రాలు..   - ఒంగోలు
 లక్ష్యం
 దాదాపు 22ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల ఏదో గాలివాటంలా వెళ్లి ఆ సంస్థలో చేరిపోలేదు. అది ఆయన కల. చదువు పూర్తయిన తరువాత ప్రముఖ సంస్థ ‘సన్ మైక్రో సిస్టమ్స్’లో చేరినప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీనే ఆయన లక్ష్యం. ఆ కలను నెరవేర్చుకున్నారు.


 పాఠం : నేటి ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో చాలామంది ఏదో ఉద్యోగం లేదా క్యాంపస్ ఇంటర్య్వూలో ఓ కొలువు దొరికితే చాలు అనుకుని సరిపెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంటే మనలోనూ ఎందరో సత్య నాదెళ్లలు ఎదుగుతారు.

 ప్రజాభిమానం
 సైబర్ ప్రపంచంలో సత్య నాదెళ్ల పేరు మార్మోగిపోతోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆయనను ప్రకటించగానే 50కోట్ల మంది నెటిజన్లు ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. ఇక గూగుల్ సెర్చ్‌లో సత్య నాదెళ్ల పేరు టైప్ చేయగానే అర సెకనులో దాదాపు 44 కోట్ల వెబ్ పేజీలు అందబాటులోకి వచ్చాయి. సెర్చ్ రికార్డుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (65కోట్లు), బిల్‌గేట్స్ (48కోట్లు), తరువాత మూడో వ్యక్తిగా సత్య నిలిచారు.

 పాఠం : ఉన్నత భవిష్యత్తే ప్రాతిపదికగా చేసుకుంటే ఎంతోమంది నెటిజన్ల కళ్లు మీ కోసం వెదుకుతాయి.

 శక్తిసామర్థ్యం
 సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికవడం భారతీయ విద్యార్థుల సత్తాకు నిదర్శనం. అమెరికా, చైనాతో సమానంగా కొందరు భారతీయ విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను చూపుతున్నారు. లేదంటే 47 ఏళ్ల సత్యకు మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ సారథ్యం ఎలా లభిస్తుంది.

 పాఠం: ఆకాశమా నీవెక్కడ... అంటూ ముందే చతికిలపడిపోకూడదు. ఆకాశమే హద్దు అంటూ ఎదిగితే అవకాశం మీదే అని ఆచరణలో చాటి చెప్పారు నాదెళ్ల. ఏటా బయటకు వస్తున్న ఇంజినీర్లను చూసి అమెరికానే నోరెళ్ల పెడుతోంది.

 ఆత్మస్థైర్యం
 ‘ప్రపంచమంతా సాఫ్ట్‌వేర్ శక్తితో మున్ముందుకు దూసుకువెళ్తోంది. మైక్రోసాఫ్ట్ పగ్గాలను అందుకోవడం ద్వారా నవకల్పనలతో నాదైన ముద్రను వేయడానికి వీలవుతుందనే నేను ఈ అత్యున్నత పదవిని అధిష్టించేందుకు ముందుకొచ్చా. అయితే, ఈ అవకాశం వచ్చేముందు ఎందుకు సీఈవో కావాలనుకుంటున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నా. 1.3 లక్షల మంది మానవ మేధస్సులతో నిండిన మైక్రోసాఫ్ట్ వంటి అత్యుత్తమ కంపెనీకి సారథ్యం వహించడం ద్వారా మనమేంటో ప్రపంచానికి చాటి చెప్పగల అద్భుత అవకాశం లభించినట్టే. ఇదే నా అంతరాత్మ నాకు చెప్పింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నా సంసిద్ధతను వ్యక్తం చేశా.’ అని సత్య పేర్కొన్నారు.

 పాఠం : పెద్ద అవకాశాలు కళ్లముందున్నా... ఆ బాధ్యతకు నేను తగను. ఆ స్థాయి నాది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ సత్యం అలా అనుకోలేదు. ఆ పదవికి నేనే అర్హుడిని అనే ఆత్మస్థైర్యాన్ని స్వీకరించారు. ఆ ధైర్యం అందరూ అలవరుచుకోవాలి.

 నాయకత్వం
 ‘ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. ఇంజినీరింగ్ నేపథ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడిగా నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సత్యకు బాగా తెలుసు.’ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు.

 పాఠం: ఎంత అదృష్టం. సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి కనిపించలేదంటూ సంస్థ అధినేతే ప్రశంస. ఏ సంస్థలో.. ఏ రంగంలో పనిచేసినా అధినేతల మెప్పును పొందాలంటే ఎంత కృషి... కఠోర శ్రమ కావాలి. ఆ స్ఫూర్తిని ఆయన్నుంచే తీసుకుంటే... విజయాలే మన వెంట.

 నైపుణ్యం
 సత్య అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలరు. సత్య నాదెళ్ల గొప్ప సీఈవో అవుతారన్న నమ్మకం నాకుంది. - స్టీవ్ బామర్, వైదొలుగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో
 
పాఠం : సహజంగా ఆ స్థానాన్ని ఎవరైనా అధిరోహిస్తే అప్పటివరకు ఆ సీట్లో ఉన్నవాళ్లలో అసూయ ఆవహిస్తుంది. కానీ మాజీ సీఈవో బామర్ అలా అనుకోలేదు. ఆ సామర్థ్యం నాదెళ్లకే ఉందంటూ స్వాగ తించడం గొప్ప స్ఫూర్తిమంత్రం. చిన్న ఉద్యోగి నుంచి ఉన్నత వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సిన మంచి సూత్రం.
 
నమ్మకం
 రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం కానుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్, సాఫ్ట్‌వేర్ ప్రాణం పోసుకుని మనం చేస్తున్న అనేక పనుల్లోకి, వ్యాపారాల్లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకి చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. - సత్య నాదెళ్ల
 
పాఠం : ముందు చూపును చెబుతోంది ఈ సూత్రం. ఏ రంగం ఎంచుకున్నా ముందు తరాల్లోకి ఎలా దూసుకుపోతుందో ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం అని చెబుతోంది.

 
పట్టుదల
 ‘మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అనుమానాన్ని దరిదాపుల్లోకి రానీయకూడదు. అప్పుడే చేయాల్సిన పనిపై స్పష్టత  మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతిభ పునాదిపై నవలోకాన్ని నిర్మిద్దాం.’ - సత్య నాదెళ్ల
 
పాఠం: ఆదిలోనే హంసపాదులు ఎంచే వాళ్లు చాలామంది మనలో ఉన్నారు. చేసేది మంచి పని అయినప్పుడు అనుమానాల్సి దరిచేరనీయవ ద్దని చెబుతోంది ఈ సూత్రం. భయం ఉదయించినపుడే అపజయం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నేటి తరానికి.

 స్ఫూర్తి
 హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఓసారి క్రికెట్ మ్యాచ్‌లో నేను మామూలుగా బౌలింగ్ చేస్తున్నాను. వికెట్లు పడడం లేదు. ఆ క్షణంలో మా కెప్టెన్ తనే బాల్‌ను తీసుకుని వికెట్లు తీసి ఆ తరువాత మళ్లీ నాకు బౌలింగ్ ఇలా చేయ్ అంటూ బాల్‌ను చేతికిచ్చారు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇదేనా నాయకత్వం లక్షణం. - సత్య నాదెళ్ల
 
పాఠం: ఆటలోనూ సందేశం అందిపుచ్చుకున్నారీయన. అలా కాదు ఇలా అని చెప్పేవాళ్లు మనకూ తారసపడతుంటారు. కానీ అక్కడితో అది మరిచిపోతుంటాం. అందులోంచి స్ఫూర్తి తీసుకోవాలంటున్నారు నాదెళ్ల.

 
విజయం
 ఏడాదికి రూ.112 కోట్లు, పాత సీఈవో మూల వేతనం కన్నా ఆయనకు 70 శాతం ఎక్కువే. కంపెనీ అందించే మరిన్ని సౌకర్యాలు అదనం.
 
పాఠం : నాదెళ్లవైపు ఇప్పుడు ప్రపంచమే చూస్తోంది. ఆ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తే అంతకాకపోయినా అందులో సగం దూరమైనా వెళ్లొచ్చు. యువతా.. బెస్ట్ ఆఫ్ లక్..

మరిన్ని వార్తలు