వేర్వేరు కేసుల్లో 10 మంది అరెస్టు

13 Nov, 2014 01:47 IST|Sakshi
వేర్వేరు కేసుల్లో 10 మంది అరెస్టు

విశాఖపట్నం : నగర పోలీసులు వేర్వేరు కేసుల్లో పది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి గాజువాక పోలీసులు 196 గ్రాముల బంగారం, త్రీటౌన్ పోలీసులు 67.05గ్రాముల బంగారం, 265.45గ్రాముల వెండి సామగ్రి, సీసీఎస్ పోలీసులు నకిలీ కరెన్సీ నిందితులనుంచి రూ.25,500 , రూ.20వేలు నకిలీ నోట్లు,  సీబీజెడ్ బైక్,  సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడజోన్ పోలీసులు రూ.6 లక్షల విలువైన 62 కుట్టుమెషీన్లు, 2 ఏసీ మెషీన్లు, ఆల్టో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. బుధవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

ఘరానా దొంగలు...
నగరంలో మర్రిపాలెంకు చెందిన బోయి లీలా విలాస్ శ్రీనివాసరావు, కంచరపాలెం జవహర్‌లాల్ నెహ్రూ నగర్‌కు చెందిన పందిరిపల్లి జయరాం, ఫణీంద్రకుమార్ అలియాస్ ఫణి అపెరల్ పార్కు, ఈ బ్లాక్‌లో ఆంధ్రాబ్యాంక్ సీజ్ చేసిన చందు అపెరల్స్, నిట్స్ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీలో గత సెప్టెంబర్ 14న చొరబడ్డారు. డెరైక్టర్ చాంబర్‌లోని కిటికీ గ్రిల్ తొలగించి 110 కుట్టు మెషీన్లు, ఇతర సామగ్రి తరలించుకుపోయారు.  బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దువ్వాడ జోన్ పోలీసులు నిందితుల్లో బోయి లీలా విలాస్ శ్రీనివాసరావు, పందిరిపల్లి జయరాంను ఈ నెల 11న అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.6 లక్షల విలువైన కుట్టు మెషీన్లు, రెండు ఏసీ మెషీన్లు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడు ఫణీంద్రకుమార్ పరారీలో ఉన్నారు.
 
నకిలీ నోట్ల ముఠా...
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు ఈ నెల 11న అదుపులోకి తీసుకున్నారు. పూర్ణామార్కెట్ నుంచి రైల్వేస్టేషన్ వైపు వస్తున్న మహ్మాద్ జియా, మహ్మాద్ అనిస్ సోహాలీలు పోలీసులను చూసి పరారవుతుండగా అదుపులోకి తీసుకుని సీఐ ప్రశ్నించారు. నకిలీనోట్ల చెలామణి చేస్తున్నట్టు వెల్లడైంది. వారి నుంచి రూ.25 వేల దొంగనోట్లు, రూ.20 వేల నగదు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వి.బాబ్జిరావు, ఎస్‌ఐ కె.కుమారస్వామి, హెచ్‌సీ డి.రాంబాబు, బి.అప్పారావును డీసీసీ అభినందించారు.
 
దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు..
ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యకులను గాజువాక దువ్వాడ జోన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విజయనగరం జిల్లా, చీపురుపల్లి  కొత్తవీధికి చెందిన షేక్ అజీజ్, అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌కు చెందిన పాశాల హేమంత్, గాజువాక పిలకవానిపాలేనికి చెందిన పున్నపు ప్రసాదరావు ఇటీవల గాజువాక రాజీవ్‌నగర్, వుడా ఫేస్ 7, హెచ్‌ఐజీ-129లో ప్రవేశించి ఇనుపబీరువాను పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. బాధితుడు వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు  దువ్వాడజోన్ పోలీసులు కేసు నమోదు చేశారు.  బుధవారం ఉదయం లంకెలపాలెం జంక్షన్‌లో వారిని అరెస్టు చేశారు. నిందితులనుంచి 196గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

ఘరానా దొంగలు ముగ్గురు...
దొంగతనాల్లో ఆరితేరిన ముగ్గురు వ్యక్తులను త్రీటౌన్ ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్- 10కి చెందిన ఎర్ని శ్రీనివాసరావు అలియాస్ శ్రీను, కంచరపాలెం పట్టాభిరామిరెడ్డి గార్డెన్స్‌కు చెందిన కోసూరి భాస్కరరావు, పాతడైరీ ఫారం, వివేకానందనగర్‌కు చెందిన నట్టి సతీష్‌కుమార్ కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 28న సెక్టారు 11, ప్లాట్ నంబరు 3 ఇంటి మెయిన్ డోరు తెరిచి బంగారం, వెండి ఆభరణాలు దోచుకుని పోయారు.  

ఈ నెల 3వ తేదీన అదే ఇంట్లో మరో సారి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఇంటి యజమాని నిట్టల ధనరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ నెల 11న సీఐ ఎల్.మోహనరావు ఆధ్వర్యంలో నిందితులను అప్పుఘర్ వద్ద గల లుంబిని పార్క్ బస్‌స్టాపులో అరెస్టు చేశారు. వారి నుంచి 67.05 గ్రాముల బంగారు ఆభరణాలు, 265.45గ్రాముల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో క్రైం ఏడీసీపీ ఎస్.వరదరాజు, క్రైం ఏసీపీ పార్థసారథి, ఈస్ట్ ఏసీపీ డి.ఎన్.మహేష్, గాజువాక, దువ్వాడ జోన్, త్రీటౌన్ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు