పదిలో పది సాధిస్తాం..!

13 Jun, 2014 03:00 IST|Sakshi
పదిలో పది సాధిస్తాం..!

 జలుమూరు/సంతకవిటి: మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి.. ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తాం.. క్రమ శిక్షణా యుత విద్యను అందిస్తాం.. పదో తరగతిలో శతశాతం ఫలితాలతో పాటు పదికి పది పాయింట్లు సాధించేలా తీర్చిదిద్దుతాం... పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తామంటూ జలుమూరు మండలం పాగోడు, సంతకవిటి ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రచారం ఆకట్టుకుంటోంది. తమపై నమ్మకం ఉంచి పాఠశాలల్లో చేర్పించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. అర్హత గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల సొంతమని, వేలకువేలు ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం మధ్య అవగాహనతో కూడిన విద్యను బోధిస్తున్నామని, విద్యార్థిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు.
 
 గత నెల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పాగోడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అందవరపు  శ్యామ్ సుందరరావు 10కి 10 పాయింట్లు సాధించాడని విడమర్చి చెబుతున్నారు. హెచ్‌ఎం ఉప్పాడ శాంతారావు, ఉపాధ్యాయులు ఎస్.వి.వెంకటరమణ, ఎం.శారద, డి.గణేష్, కె.శ్రీనివాసరావు, సీహెచ్ చంద్రభూషణరావు, టి.ఉమామహేశ్వరరావు, టి.గుప్తాలాల్, అచ్చుతరావు, అశోక్ కుమార్ పాడీ, ఎస్.శ్రీనివాసరావుల ఇంటింటి ప్రచారానికి గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రోజురోజుకూ ప్రవేశాలు పెరుగుతున్నాయి.  సంతకవిటిలో హెచ్‌ఎం త్రినాథరావు, ఆంగ్ల బోధకుడు అదపాక దామోదరరావు, ఇతర ఉపాధ్యాయులు ప్రచారం చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు