ఒకే చెట్టుకు పది రకాల మామిళ్లు!

7 May, 2018 02:22 IST|Sakshi

గుణదల (విజయవాడ తూర్పు): అంటుకట్టే విధానం ద్వారా విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన చతుర్వేదుల శ్రీనివాస శర్మ తమ పెరట్లో పెంచిన మామిటి చెట్టు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే చెట్టుకు దాదాపు పది రకాల మామిడి కాయలు కాయడంతో వీక్షకులను అబ్బుర పరుస్తోంది. నాటు మామిడి మొక్క పెరుగుతున్న కొద్దీ దాని కొమ్మలకు బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు వంటి వివిధ రకాల కొమ్మలను శ్రీనివాసరావు అంటుకట్టారు.

ప్రస్తుతం ఈ చెట్టుకు తోతపురి, బంగినపల్లి, సువర్ణరేఖ, సొరమామిడి, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకురసం, తుమాని వంటి పది రకాలు మామిడి కాయలు కాస్తున్నాయి. తన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు ఇన్ని రకాల మామిళ్లు కాయిస్తున్న శ్రీనివాస శర్మ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ అంటుకట్టే విధానంలో ఆయన ఇప్పటివరకూ మామిడి, సీతాఫలం, నేరేడు, బత్తాయి, రేగు పండ్లతో పాటు మందారం, గన్నేరు, వంటి పుష్ప జాతులకూ అంటుకట్టారు.

మరిన్ని వార్తలు