అనంతపురం(లీగల్): ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం మూడో అదనపు సెషన్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. అనంతపురం జిల్లా తలుపుల మండలం పెన్నబడివాండ్ల పల్లి గ్రామంలో 2014 ఆగస్ట్ 4న తన ఇంటికి సమీపంలో స్నేహితులతో కలసి ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారికి... అదే గ్రామానికి చెందిన పి.సిద్ధార్థరెడ్డి(20) జామకాయ ఇస్తానని ఆశ చూపించి గుడి చాటుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
జ్వరంతో వణికిపోతున్న చిన్నారిని అవ్వ గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తనకల్లు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నిరూపితమవడంతో తిరుపతిలోని చిన్నారి తల్లిదండ్రులు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను, వాదోపవాదాలను విన్నజడ్జి సునీత... చిన్నారి అపహరణ, అత్యాచారం, బెదిరింపు నేరాభియోగాల కింద నిందితుడు సిద్ధార్థరెడ్డికి మొత్తం పదేళ్ల జైలు శిక్ష, రూ.22 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు.