రూ.50 వేలు కొట్టు.. కేసు ఉంటే ఒట్టు !

4 Jul, 2019 10:49 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  వ్యాపారాలు అక్రమంగా చేసే వారికి తెనాలి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. అడిగినంత మొత్తం ఇచ్చేస్తే చూసీ చూడనట్టు వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు సైతం ఉండకుండా అధికారులను సైతం కిందిస్థాయి సిబ్బంది ‘మేనేజ్‌’ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. తెనాలి పట్టణంలోని ఒక్క పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే రూ. రెండు లక్షల వరకు అక్రమ వ్యాపారుల నుంచి పోలీసు సిబ్బంది గుంజుకున్నట్టు తెలిసింది. ముత్తెంశెట్టిపాలెంలోని ఓ వ్యక్తి నిషేధిత గుట్కాల్ని విక్రయిస్తాడన్న పేరుంది. ఇటీవల ఓ రోజు రాత్రి  ఆయన దుకాణం వద్ద గుట్కా ప్యాకెట్ల లోడు దించుతున్న సమయంలో పోలీసులు వెళ్లారు. ఆ వ్యాపారి రూ. 50 వేలు ఇవ్వడంతో తమకేం తెలియనుట్ట పోలీసులు వెళ్లిపోయారని సమాచారం.

రామలింగేశ్వరపేట పాత డిపో వద్ద మరో దుకాణ నిర్వాహకుడి వద్దకు వెళ్లిన ముగ్గురు పోలీసులు విజిలెన్స్‌ అధికారుల మంటూ సోదాల పేరిట రూ. 50 వేలు తీసుకున్నారు. ఆ ముగ్గురిలో స్థానికేతరుడైన హోంగార్డు ఉన్నట్టు సమాచారం. మార్కెట్‌లోని దుకాణ నిర్వాహకుడు, చేబ్రోలుకు చెందిన వ్యాపారి నుంచి రూ. 50 వేలు చొప్పున వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తుంటే, సిబ్బంది మాత్రం వసూలు రాజాలుగా మారి, అక్రమ వ్యాపారులకు కొమ్ముకాస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు సిబ్బంది చేతి వాటం గురించి డీఎస్పీ ఎం.స్నేహితను వివరణ కోరగా, బాధిత వ్యాపారులు తనను సంప్రదిస్తే న్యాయం చేస్తానని చెప్పారు. ఓ వైపు తాము పొగాకు ఉత్పత్తుల విక్రయంపై ఉక్కుపాదం మోపుతుంటే, వాటి విక్రయాలను సమర్థిస్తూ అవినీతికి పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు