‘అమ్మ’ ఆదాయానికి టెండర్

25 Sep, 2013 05:31 IST|Sakshi


 సాక్షి, విజయవాడ :
 ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్ల టెండర్ల విషయంలో కాంట్రాక్టర్ల హవా కొనసాగుతోంది. వారికి రాజకీయ నేతలు, ఆలయ సిబ్బంది కొందరు తోడుకావడంతో ఇష్టానుసారంగా టెండర్లను మార్పు చేసుకుంటున్నారు. అదేమని ప్రశ్నించే దేవస్థాన అధికారులను అర్థ, అంగబలంతో అడ్డుకుంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో  ‘అమ్మవారి’ పైనే భారం వేసి అధికారులు నోరు మూసుకుంటున్నారు.
 
 ప్రసాదం కవర్ల టెండర్లలో మాయాజాలం
 దసరా ఉత్సవాలకు ప్రసాదాల కవర్ల సరఫరాకు అధికారులు ఈ-టెండర్లు పిలిచారు. చాలా మంది కేజీకి రూ.159  నుంచి రూ.163 వరకు టెండర్లు దాఖలు చేశారు. మచిలీపటాన్నికి చెందిన కాంట్రాక్టరు మాత్రం రూ.129కే టెండర్ వేశారు. టెండర్లు తెరిస్తే అతి తక్కువ ధరకు కవర్లు సరఫరా చేసేవారికే కాంట్రాక్టు దక్కుతుంది. దీనివల్ల కాంట్రాక్టర్‌కు లక్షల రూపాయల్లో నష్టం వస్తుంది. టెండర్ల వ్యవహరాన్ని చూసే ఒక గుమాస్తా ఒకరు ఈ విషయం  సదరు కాంట్రాక్టర్ చెవిన వేశాడు. మిగిలిన కాంట్రాక్టర్ల కంటే తక్కువ ధరకు టెండర్ వేసినట్లు తెలుసుకున్న ఆ కాంట్రాక్టర్, గుమాస్తాతో కలిసి ఈ-టెండర్లు సైట్‌ను బ్లాక్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ సైట్ తెరుచుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిసింది.
 
 భోజన ప్యాకెట్ల టెండర్లలోనూ గోల్‌మాల్!
 దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీల్రాదిపై విధులు నిర్వహించే సిబ్బందికి ఆహార పొట్లాలు సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లులోనూ కాంట్రాక్టర్ల హవా నడిచింది. మూడు సెక్టార్లతో సుమారు మూడు వేల మందికి భోజన ఏర్పాటు చేసేందుకు దేవస్థానం ఈ టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లకు సరైన అనుభవం లేదంటూ తొలిసారి వచ్చిన టెండర్లను అధికారులు రద్దు చేశారు. కాంట్రాక్టర్లు తమ లాబీయింగ్ ఉపయోగించడంతో రెండోసారి అర్హత లేనివారికే టెండర్లు కట్టబెట్టారు. నేరచరితులు, కొండపైనే అనేక కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వారికే టెండర్లు దక్కాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కొంతమంది కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
 
 పనుల్లోనూ అంతా గోప్యమే
 దసరా సందర్భంగా నిర్వహించే పనులకు పిలిచే టెండర్ల విషయంలోనూ అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. క్యూలైన్ల పైన వాటర్ ప్రూఫ్ షామియానాలు, బాణసంచా కోనుగోళ్లు, మైక్ ప్రచారం తదితర 14 పనులుకు ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. దేవస్థాన అధికారుల ఆశీస్సులు, రాజకీయనేతల ‘హస్తం’ ఉన్న స్థానిక కాంట్రాక్టర్లే ఈ టెండర్లు దక్కించుకున్నారనే విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల బినామీలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అమ్మవారి సొమ్ముకు గండి పెడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి దేవస్థాన టెండర్లపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు