ఆ ఐదు కంపెనీలపై అమితప్రేమ

18 Jan, 2019 03:05 IST|Sakshi

రాజధానిలో రూ.25 వేల కోట్ల విలువైన పనులు వాటికే..

ఆ కంపెనీల అర్హతలే టెండర్‌ నిబంధనలు

ప్రతిపాదనల దశలోనే పనులు కేటాయించేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు ఏడు వేల నుంచి పది వేల రూపాయలకుపైగా అంచనాలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని ఎలాంటి పోటీ లేకుండా అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. కేవలం ఐదు నిర్మాణ సంస్థలకు నాలుగున్నరేళ్లలో రూ.25 వేల కోట్లకుపైగా పనుల్ని అప్పగించింది. ప్రతిపాదనల దశలోనే ముఖ్యమంత్రి నోటి మాటతో వందల కోట్ల రూపాయల పనుల్ని ఈ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలైతే ఆ ఐదు సంస్థలే తయారుచేసి ముఖ్యమంత్రి ఎదుట పెడుతుండగా.. ఆయన ఆమోదముద్ర వేసి వాటికే నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తుండడం గమనార్హం. ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ, షాపూర్‌జీ పల్లోంజి, బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీలకు 80 శాతానికిపైగా పనులు కేటాయించగా మిగిలిన పనుల్ని బీఎస్‌సీపీఎల్, మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీలకు అప్పగించారు. 

ఎల్‌ అండ్‌ టీకి రూ.8 వేల కోట్ల పనులు.. 
ఇప్పటివరకూ రూ.39,875 కోట్ల విలువైన పనుల్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందులో ఒక్క ఎల్‌ అండ్‌ టీ సంస్థకే రూ.8 వేల కోట్లకు పైగా పనుల్ని కట్టబెట్టారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ఈ సంస్థే నిర్మించగా.. ఇటీవలే మొదలైన శాశ్వత సచివాలయంలోని మూడు, నాలుగు టవర్లు, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి, తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణంతోపాటు రెండు భూ సమీకరణ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, పలు రోడ్ల ప్రాజెక్టులనూ ఎల్‌ అండ్‌టీ కే అప్పగించారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్, శాశ్వత సచివాలయంలో జీఏడీ టవర్, ఐఏఎస్‌ అధికారుల నివాస భవనాలు, రోడ్ల ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఎన్‌సీసీ చేజిక్కించుకుని మొత్తంగా రూ.4,700 కోట్ల విలువైన పనులు చేస్తోంది. షాపూర్‌జీ పల్లోంజి సంస్థ రూ.3 వేల కోట్లకు పైగా పనుల్ని చేపట్టగా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతో పాటు శాశ్వత సచివాలయంలోని ఒకటి, రెండు టవర్లు.. పూర్తిస్థాయి హైకోర్టు భవనం, గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగుల నివాస భవనాలు, ఇతర పనులను అప్పగించారు. 

ఆ కంపెనీల అర్హతలే టెండర్‌ నిబంధనలు.. 
రూ.వేల కోట్ల విలువైన పనుల్ని ఈ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను వారికి అనుకూలంగా మార్చేస్తోంది. ఏ ప్రాజెక్టును ఎవరికివ్వాలో ముందే నిర్ణయించేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలను సైతం ఆ కంపెనీలతోనే తయారు చేయిస్తున్నారు. పనులు అప్పగించిన తర్వాత ఆ కంపెనీలకున్న అర్హతలనే నిబంధనలుగా టెండర్లలో పెడుతుండడంతో ఇతర కంపెనీలకు అవకాశం దక్కడం లేదు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజి సంస్థలకు అప్పగించేందుకు టెండర్లలో ప్రి కాస్ట్‌ భవనాలు నిర్మించిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు.

దీంతో దేశంలో ఎన్నో భవనాలు నిర్మించిన కంపెనీలు కూడా ఈ పనులకు అర్హత సాధించలేకపోయాయి. కానీ ఎల్‌ అండ్‌ టీ ప్రి కాస్ట్‌ కాకుండా సాధారణ గోడల్నే కట్టేసి.. ఆ తర్వాత నిబంధనలను మార్పు చేయించుకుంది. భవన నిర్మాణాలతో సంబంధం లేకుండా ఎస్టీపీ, రోడ్ల నిర్మాణం, అంతర్గత వసతుల పనులు చేసి ఉండాలనే నిబంధనను విధించడం ద్వారానే ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజి, ఎన్‌సీసీ కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన పనుల్ని కట్టబెట్టారు. పలు రోడ్ల పనుల్ని సైతం వారికే అప్పగించి వాటితో సంబంధం లేని పనులు కూడా చేసి ఉండాలనే నిబంధనలు విధించారు. 

సర్కార్‌ పెద్దల కమీషన్లకు భయపడి.. 
రాజధాని నిర్మాణ వ్యవహారాలు చేపట్టిన సీఆర్‌డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కంపెనీలతో కుమ్మక్కై నిబంధనలు వారికి అనుకూలంగా రూపొందిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందామని మొదట్లో టాటా కనస్ట్రక్షన్స్‌ వంటి కంపెనీలు ముందుకు వచ్చినా.. సర్కారు అనుకూల కంపెనీల ముందు నిలవలేకపోయాయి. సింగపూర్, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు సైతం సర్కారు పెద్దల కమీషన్ల డిమాండ్లతో అవాక్కై వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో పోటీ లేకుండా తాము తయారుచేసిన అంచనాల ప్రకారమే ప్రాజెక్టులు దక్కించుకుని ఆ కంపెనీలు లాభాలు పండించుకుంటుండగా.. సర్కారు పెద్దలు కమీషన్ల మత్తులో మునిగి మిగిలిన పనుల్నీ వారికే కేటాయించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు