ఆర్‌అండ్‌బీపై తమ్ముళ్ల పెత్తనం

23 Apr, 2016 04:47 IST|Sakshi
ఆర్‌అండ్‌బీపై తమ్ముళ్ల పెత్తనం

బిట్లు బిట్లుగా విభజించి పనులకు టెండర్ల ప్రక్రియ
ఆన్‌లైన్లో సింగిల్ టెండర్‌కు టీడీపీ నేతల విశ్వప్రయత్నాలు
ఒక్కో పనికి ఒకటికి మించి అదనంగా దాఖలైన టెండర్లు
గతనెల 29వ తేదీ ఆఖరు.. నేటికీ ప్రకటించని అధికారులు
మింగుడు పడక ఈ టెండర్లను రద్దు చేయించే యత్నం

 
 పొదలకూరు : ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు తమ్ముళ్ల పెత్తనం పెరిగింది. రాజకీయాలకు సంబంధం లేని చేపట్టే రూ.కోట్లాది పనుల వివరాలను ఆ శాఖ అధికారులు తెలుగు తమ్ముళ్ల నోటీసుకు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. టెండర్ల దగ్గర నుంచి పనులు ప్రారంభించేంత వరకు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నిర్వహించాలనే వారు అధికారులపై ఒత్తిడి తెస్తుండటతో సతమతమవుతున్నారు. ఇప్పటి వరకు ఈ పరిస్థితి పంచాయతీరాజ్‌శాఖకే ఉండేది. కొత్తగా ఆర్‌అండ్‌బీకు సైతం పాకింది. పొదలకూరు ఆర్‌అండ్‌బీ సబ్‌డివిజన్ పరిధిలో ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పొదలకూరులోని రామనగర్‌గేటు సెం టర్‌లో ఎఫ్‌డీఆర్ రూ.50 లక్షల సిమెంటురోడ్ పనులను తమ్ముళ్లు నామినేటెడ్ కింద దక్కించుకుని చేపడుతున్నారు. సంగం-పొదలకూరు మార్గంలో రెండు బిట్లు, మనుబోలు-పొదలకూరు మార్గంలో ఒక బిట్ ఆర్‌అండ్‌బీ డబుల్ రోడ్ల నిర్మాణం టెండర్ల ప్రక్రియ పూర్తగా గోల్‌మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ నచ్చని టీడీపీ నాయకులు జగిరిన టెండర్లను రద్దు చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం తమకు అనుకూలం గా టెండర్ల ప్రక్రియ జరగలేదనే అక్కసుతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి జరిగిన టెండర్లను రద్దుచేయించి మళ్లీ కొత్తగా టెండర్లను పిలిచే ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారంఉంది. గతంలో సంగం-పొదలకూరు మార్గంలో 0 నుంచి 10 కిలోమీటర్ వరకు నాబార్డు నిధులు రూ.7 కోట్లతో టెండర్లప్రక్రియ పూర్తయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

తర్వాత రూ.8.9 కోట్లతో రెండు బిట్లుగా 10/0 నుంచి 15/0 వరకు రూ.3.9 కోట్లు, 16/100 నుంచి 23/4 వరకు రూ.5 కోట్లతో అంచనాలు రూపొందించి గతనెల 29న టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ పనులకు సింగిల్ టెండర్లను వేయించాలని టీడీపీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు బెడిసి కొట్టి ఒకటి కంటే అదనంగా టెండర్లు ఆన్‌లైన్‌లో పడ్డాయి. దీంతో టీడీపీ నేతలు టెండర్లను రద్దుచేయించే యోచనలో ఉన్నారు. అయితే గతనెల 29న వేసిన టెండర్లను ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా ఇప్పటివరకు తెరిచి పనులను ప్రకటించలేదు. మనుబోలు-పొదలకూరు మార్గంలో 15/0 నుంచి 18/0 వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు.

ఈ పనులకు సైతం 29నే టెండర్ల ప్రక్రియ జరిగింది. అయితే నేతల ప్రయత్నాలు ఫలించి రూ.3కోట్ల పనికి సింగిల్ టెండరే పడింది. దీంతో శాంతించిన నేతలు ఈ పనులను మాత్రం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పనులు తమ అనునయులకు దక్కవనుకునే టెండర్లను మాత్రం టెండర్లను రద్దు చేయిస్తారనే ప్రచారం ఉంది. ఇందువల్ల పనులను చేపట్టడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఏళ్లతరబడి రోడ్ల పనులు జరక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.


 టెండర్ల ప్రక్రియ పూర్తిచేశాం : -ఎల్.మాల్యాద్రి, డీఈ, పొదలకూరు
 సంగం-పొదలకూరు మార్గంలో రెండు బిట్లు రూ.8.9 కోట్లు, మనుబోలు-పొదలకూరు మార్గంలో రూ.3 కోట్లతో డబుల్‌రోడ్ల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశాము. ఇంకా టెండర్లను తెరిచి పనులను అప్పగించలేదు. ఎస్‌ఈ స్థాయిలో టెండర్లను తెరిచే ప్రక్రియ జరుగుతుంది.

మరిన్ని వార్తలు