అవినీతి వల్లే టెండర్లు రద్దు 

4 Aug, 2019 03:54 IST|Sakshi

చంద్రబాబు, ఉమా బ్రోకర్లలా వ్యవహరించారు: మంత్రి కొడాలి నాని 

విజయవాడ: టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు అవినీతిమయంగా జరిగినందువల్లే టెండర్లను రద్దు చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం కాంట్రాక్టుల్లో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు. డబ్బులు దండుకుని నవయుగకు కాంట్రాక్టు పనులు అప్పగించారన్నారు. టెండరుదార్లతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి నవయుగకు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

ప్రజాధనం వృథా కాకూడదనే నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాఫర్‌ డ్యామ్‌ కట్టి పోలవరాన్ని తాను కట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరాన్ని సొంత హెరిటేజ్‌ సంస్థలా వాడుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు, దేవినేని ఉమా ముఖ్యమంత్రి జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఇతర నాయకులు ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఇక మీదట సహించేది లేదన్నారు.  

మరిన్ని వార్తలు