టెండర్లకే టెండర్‌!

6 Nov, 2018 06:41 IST|Sakshi
పాత కాంట్రాక్టర్లకే అవకాశం ఇచ్చేలా టెండర్‌ దరఖాస్తుల్లో పొందుపరిచిన నిబంధన

రోడ్లు భవనాల శాఖలో వికటించిన మంత్రాంగం

రోడ్ల నిర్వహణ పనుల్లో కమీషన్ల కోసం రాయబారాలు

మంత్రి తనయుడి స్నేహితుడి ఆధ్వర్యంలో ఒత్తిళ్లు

చర్చల కోసమే మూడుసార్లు టెండర్ల పొడిగింపు

అవి ఫలింకపోవడంతో ఏకంగా టెండర్ల రద్దు

టెండర్ల ప్రక్రియ సాగుతోందని అదే రోజు మంత్రి చెప్పడం విశేషం

మంత్రులకు తెలియకుండానే వారి శాఖల్లో కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయా?.. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు సంబంధించిన టెండర్ల రద్దు తతంగం చూస్తే.. ఈ అనుమానాలు కలగకమానవు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని ఆ శాఖ మంత్రి ప్రకటించిన రోజే.. అవి రద్దు కావడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.టెండర్ల రద్దు వెనుక కూడా నెలరోజులకు పైగా పెద్ద మంత్రాంగమే నడిచినట్లు తెలుస్తోంది. రూ.1300 కోట్ల విలువైన ఈ పనులను కొద్దిమంది పాత కాంట్ట్రార్లకే.. అదీ ఎక్సెస్‌ రేటుతో కట్టబెట్టి.. ఆ ఎక్సెస్‌ రేటులో మాకింత.. మీకింత.. అని వాటాలు పంచుకునే ప్రణాళికను అమలు చేయాలని పథకం పన్నారు.  మూడు నాలుగు దఫాలు చర్చల పేరుతో కాంట్రాక్టర్లను లొంగదీసుకునేందుకు ఆ శాఖలో భారీగా లాబీయింగ్‌ నిర్వహించే ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ప్రస్తుతానికి ఆ టెండర్లను రద్దు చేశారు.

సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఎంపిక చేసిన వారికే..ఎక్కువ రేటుకు పనులు కట్టబెట్టడం.. ఆమోదించిన ఎక్కువ రేటులో కమీషన్లు కొట్టేయడమే లక్ష్యంగా నెలరోజులకుపైగా సాగిన మంత్రాంగం బెడిసికొట్టడంతో ఏకంగా పనుల నిర్వహణకు పిలిచిన టెండర్లను ఆ శాఖ మంత్రికే తెలియకుండా రద్దు చేయడం రోడ్లు, భవనాల శాఖలో కలకలం రేపుతోంది. దివంగత సీఎం వైఎస్‌ హయాంలో కేంద్ర సహకారంతో లాంగ్‌టర్మ్‌ ఫెర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ మెయింటెన్స్‌ కాంట్రాక్టు(ఎల్‌టీపీబీఎంసీ) అమలు చేశారు. అప్పట్లో 20 మంది కాంట్రాక్టర్లు ఈ పనులను సాఫీగానే నిర్వహించారు. అదే పథకం కింద ప్రస్తుతం కేంద్రం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 36 ప్యాకేజీలుగా సుమారు రూ.1400 కోట్ల అంచనాతో సెప్టెంబర్‌ 25న టెండర్లు పలిచారు. వీటిలో విశాఖ జిల్లాకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా విలువైన మూడు ప్యాకేజీలు ఉన్నాయి.

నిబంధనల సంకెళ్లు
ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. ఇప్పటికే ఆ శాఖ వ్యవహారాల్లో తలదూస్తున్నారన్న ఆరోపణలున్న మంత్రి కుమారుడి స్నేహితుడు రంగంలోకి దిగి చక్రం తిప్పాడు.
వరుసగా పదేళ్లు ఇవే పనులు చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులన్న నిబంధనను చేర్చడం ద్వారా మిగతా కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా చేశారు. దీంతో వారంతా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకుండా గతంలో ఈ పనులు చేసిన 20 మంది కాంట్రాక్టర్లను అక్టోబర్‌ ఐదో తేదీన విశాఖ నగరంలోని ఓ స్టార్‌ హోటల్‌లో సమావేశపర్చి ఒప్పందం కుదుర్చుకోవడానికి సదరు స్నేహితుడు ప్రయత్నించాడు. ఐదు శాఖ అధిక రేటుకు టెండర్లు ఖరారు చేసేలా చూస్తామని.. ఆ ఐదు శాతంలో ‘మూడు శాతం మాకు.. రెండు శాతం మీకు’ పద్ధతిలో పంచుకుందామని ప్రతిపాదించాడు. దీనికి కొందరు కాంట్రాక్టర్లు ససేమిరా అన్నారు.

మూడుసార్లు వాయిదా.. చివరికి రద్దు
కాంట్రాక్టర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అక్టోబర్‌ పదో తేదీన ముగియాల్సిన టెండర్ల దాఖలు గడువును అదే నెల 24కు వాయిదా వేశారు. ఈలోగా పలుమార్లు కాంట్రాక్టర్లతో రాయాబారాలు నెరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో టెండర్లను గత నెల 31వరకు ఒకసారి.. ఈ నెల 5వ తేదీకి మరోసారి.. ఇలా మూడుసార్లు వాయిదా వేశారు. జీవో నెం.180 ప్రకారం ఏర్పాటు చేసిన మెటీరియల్‌ తయారీ ప్లాంట్లను కూడా మూయించేస్తామని మంత్రి కుమారుడి స్నేహితుడు బెదిరించాడని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అయినా సరే తాము లొంగకపోవడంతో చివరికి అర్ధంతరంగా ఈనెల మూడో తేదీన మొత్తం టెండర్లనే రద్దు చేశారని ఆరోపించారు. ఆన్‌లైన్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ కూడా తొలగించారని అంటున్నారు. రోడ్లు భవనాల శాఖలో ఇతగాడి చోరబాటుతో అధికారులతోపాటు కాంట్రాక్టర్లు సైతం ఏమాత్రం ‘సంతోష’ంగా లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టెండర్ల రద్దు విషయం సంబంధిత శాఖ మంత్రితి తెలిసి జరగలేదని అంటున్నారు. సరిగ్గా టెండర్లు రద్దు చేసిన మూడో తేదీనాడే మంత్రి మీడియాతో మాట్లాడుతూ రూ.1400 కోట్లతో రోడ్ల నిర్వహణ టెండర్ల ప్రక్రియ సాగుతోందని.. త్వరలో టెండర్లు ఖరారు చేసిన పనులు చేపడతామని ప్రకటించడం విశేషం. ఆ వార్త 4వ తేదీన పత్రికల్లో వచ్చింది కూడా.

కమిషనర్‌ ఆదేశాలతో రద్దు:ఈఎన్‌సీ
ఈ అంశాలపై రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సుబ్బారావును వివరణ కోరగా.. తమ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకే టెండర్లు రద్దు చేశామని స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ పిలుస్తామన్నారు. ఈ వ్యవహారంలో జరిగిన తతంగం తన దృష్టికి రాలేదని, వాటితో తనకు సంబంధం లేదని అన్నారు. మరిన్ని వివరాలు కోరేందుకు ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు.

మరిన్ని వార్తలు