సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రెండో దశకు టెండర్లు

18 Dec, 2019 12:57 IST|Sakshi
పొంగూరు వద్ద రిజర్వాయర్‌ పనులు

టీడీపీ హయాంలో పనులు నాసిరకం

వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి అనిల్‌ హామీ

రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వానికి రూ. 67.9 కోట్ల ఆదా

90 వేలఎకరాలకుసాగునీరు

2.35 లక్షల మందికితాగునీరు

తొలి దశలో 57శాతం పనులు

సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రెండో దశకుటెండర్లు

సోమశిల హైలెవల్‌ కెనాల్‌.. మెట్టవాసుల ఆశాదీపం. మొక్క కూడా మొలవని ఈ ప్రాంతాన్నిసస్యశ్యామలం చేసేందుకు దీనికి శ్రీకారం చుట్టారు. సాగు, తాగునీటిని అందించేందుకు దశాబ్దం క్రితం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. దివంగత సీఎం వైఎస్సార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనా, అవి నత్తను తలపించాయి.జరిగిన పనుల్లోనూ ఎక్కువ శాతం నాసిరకంగానే జరిగాయి. భూ సేకరణలో సైతం జాప్యం జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించింది. తొలిదశ పనులనువేగవంతం చేశారు. రెండో దశ పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అయింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకుమంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

సాక్షి, నెల్లూరు:  ఏటా కరువు కాటకాలతో బతుకు కష్టమై వలసలకు వేదికగా మారిన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చి మెట్టవాసులను ఆదుకోవాలని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అప్పట్లో దివంగత సీఎం వైఎస్సార్‌ దృష్టికి తీసుకెళ్లారు. 2009లో సోమశిల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అనంతరం ఇంజినీరింగ్‌ అధికారులు సోమశిల జలాశయం నుంచి ఐదు టీఎంసీలను ఎత్తిపోతల పథకం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, మర్రిపాడు మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లోని దాదాపు 90 వేల ఎకరాలకు సాగునీటితో పాటు 58 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి తాగునీరందించేలా రూ.1,560 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఐదు మండలాల్లోని 5,320 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో సోమశిల జలాశయం నుంచి కాలువ తీసి మర్రిపాడు మండలంలోనిపొంగూరులో, ఇస్కపల్లి, పడమటినాయుడుపల్లి, పెగళ్లపాడులో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ ఉంచి సాగు, తాగునీరందించేలా ఏర్పాటు చేశారు. తొలి విడతగా రూ.840 కోట్లకు టెండర్‌ను ఆహ్వానించగా మెగా కంపెనీ దక్కించుకొని పనులను ప్రారంభించింది. ఐదేళ్లు పూర్తి కావచ్చినానేటికి ఆయా పనులను 57 శాతం మేరే పూర్తి చేశారు. కేవలం పొంగూరు రిజర్వాయర్‌ వరకే పూర్తి చేశారు. ఇస్కపల్లి, పడమటినాయుడుపల్లిలో భూసేకరణ కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది.

టీడీపీ హయాంలో అక్రమాలే
సోమశిల హైలెవల్‌ కెనాల్‌ భూసేకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తొలిదశలో మర్రిపాడు మండలంలోని పొంగూరులో టీఎంసీ నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్‌ పనులు చేశారు. ఆ గ్రామంలో 1,200 ఎకరాల భూసేకరణ చేశారు. అందులో 270 ఎకరాలకు మాత్రమే పరిహారమిచ్చారు. మిగిలినవి చుక్కలు భూములు, ప్రభుత్వ భూములు ఉండటంతో 930 ఎకరాలకు పరిహారాన్ని పెండింగ్‌లో ఉంచారు. పొంగూరు రెవెన్యూలో మాత్రం ఎకరా బీడు భూమికి రూ.ఐదు లక్షలు, బోరు, మోటార్‌ ఉన్న భూమికి రూ.5.5 లక్షల వంతున పరిహారమిచ్చారు. పొంగూరు కండ్రిక సమీపంలో నేషనల్‌ హైవేకు అనుకున్న భూములకు మాత్రం రూ.ఏడు లక్షల వంతున పరిహారం చెల్లించారు. ఒకే రెవెన్యూ పరి«ధిలో పరిహారం తేడాలు ఉన్న వెనుక భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక టీడీపీ నేతలు, రెవెన్యూ, తెలుగుగంగ భూసేకరణ అధికారులకు ఎకరాకు రూ.రెండు లక్షల వంతున పుచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెగళ్లపాడు, రాజులపాడు రిజర్వాయర్ల కోసం చేస్తున్న భూసేకరణలో కూడా భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. పెగళ్లపాడులో రిజర్వాయర్‌కు దాదాపు 600 ఎకరాలను సేకరిస్తున్నారు. ఆ గ్రామంలో ఎకరాకు రూ.3.5 లక్షల మేర నిర్ణయించి భూసేకరణ చేస్తున్నారు. రాజులపాడు రిజర్వాయర్‌ కోసం దాదాపు 400 ఎకరాల భూసేకరణ కోసం ఎకరాకు రూ.4.5 లక్షలు నిర్ణయించారు.   దీంతో కొందరు అక్రమార్కులు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను వెబ్‌ అడంగల్‌లో పేర్లు నమోదు చేసుకొని నకిలీ డీ ఫారం పట్టాలను సృష్టించి పరిహారం పొందారనే ఆరోపణలున్నాయి. గత టీడీపీ హయాంలో ఓ తహసీల్దారు ఎకరా ప్రభుత్వ భూమికి రేట్‌ ఫిక్స్‌ చేసి వెబ్‌ అడంగల్‌లో పేర్లు నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పడమటినాయుడుపల్లి రిజర్వాయర్‌ ముంపు గ్రామం కావడంతో అక్రమార్కులు రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు నిర్మించారు. స్థానికంగా ఉన్న కేతామన్నేరు వాగునే అక్రమించి అక్రమ కట్టడం చేపట్టారు. గామంలో దాదాపు 200 అక్రమ ఇళ్ల నిర్మాణాలు జరిగాయని సమాచారం.

నాసిరకంగా నిర్మాణాలు
సోమశిల జలాశయం నుంచి జరిగిన హైలెవల్‌ కెనాల్‌ పనులు నాసిరకంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. పొంగూరు రిజర్వాయర్‌ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కట్టకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్థానికంగానే చెరువులో ఉన్న మట్టినే తీసి కట్టకు వేశారు. ఆ మట్టిని వాడకూడదని నిపుణులు చెప్తున్నా నిర్మాణదారులు పట్టించుకోలేదు. పదికాలాల పాటు ఉండాల్సిన కట్ట పూర్తికాకముందే పగుళ్లు ఏర్పడటంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. గతంలో టీడీపీ నేతలకు మెగా కంపెనీ సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇవ్వడంతో పనుల్లో నాణ్యత తగ్గిందనే ఆరోపణలు ఉన్నాయి. పనులను నాసిరకంగా చేసి బిల్లులు తినేశారనే ఆరోపణలు ఉన్నాయి.

మెట్టకు జీవం:అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆనం, మేకపాటి
మెట్టప్రజలకు సాగు, తాగునీటిని అందించాలని 2009లోనే దివంగత సీఎం వైఎస్సార్‌ను కోరాం. అయన స్పందించి సోమశిల హైలెవల్‌ కెనాల్‌కు అంకురార్పణ చేశారు. గత టీడీపీ హయాంలో జరిగిన కెనాల్‌ పనులు నాసిరకంగా జరిగాయి. భూసేకరణలో అక్రమాలు జరగడంతో కెనాల్‌ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. ఐదేళ్ల పాటు 57 శాతం కూడా పనులను పూర్తి చేయలేకపోయారు. తొలి దశ పనులనే పూర్తి చేయలేకపోయారు. రాజకీయ అవసరాల కోసం రెండో దశ టెండర్లను ఎన్నికలకు ముందు ఆహ్వానించి గత ప్రభుత్వం మోసం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆయా పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది. హైలెవల్‌ కెనాల్‌ను పూర్తి చేస్తే మెట్ట ప్రజలు జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు.మా హయాంలోనే పూర్తిచేస్తాం –అసెంబ్లీలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పనులను తమ హయాంలోనే పూర్తి చేస్తాం. రైతు భరోసా పథకం ప్రారంభానికి నెల్లూరు వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన చొరవతోనే రెండో దశకు కూడా టెండర్లు ఆహ్వానించి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.67.9 లాభం చేకూర్చాం. గత టీడీపీ తొలి దశ పనులను 57 శాతమే పూర్తి చేసింది. ఆ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం.

రెండో దశపూర్తయితే..
సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రెండో దశ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గం సగభాగం సస్యశ్యామలమవుతుంది. దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగునీరందుతుంది. రూ.503.37 కోట్ల వ్యయంతో రెండో దశ పనులకు ప్రస్తుత ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా, రివర్స్‌ టెండరింగ్‌తో బీవీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్‌ చేజిక్కించుకుంది. 36 నెలల్లో ఆయా పనులను పూర్తి చేయాలని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. పనులు పూర్తి చేస్తే ఆ మూడు మండలాల్లోని బీడు భూములు సిరులు కురిíపించే అవకాశం  ఉంది.

మరిన్ని వార్తలు