షార్‌.. నిశ్శబ్దం!

8 Sep, 2019 10:37 IST|Sakshi

అందని మామ

రాత్రంతా జాగరణ

టీవీల ముందే గడిపిన ఉద్యోగులు

షార్‌లో కొన్ని గంటలకు ముందు హుషార్‌. చివరి క్షణాల్లో ఉద్విగ్న వాతావరణం. అంతలోనే నిశ్శబ్దం. భారత్‌కు ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగే అద్భుత క్షణాల కోసం యావత్‌ ప్రపంచంతో పాటు షార్‌ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి పావుగంటలో ల్యాండర్‌ నిర్ణీత కక్ష్యలో పయనిస్తూ వచ్చింది. అన్ని స్టేజీల్లోనూ సవ్యమార్గంలో వచ్చిన ల్యాండర్‌ చివరి స్టేజీలో గతితప్పింది. ల్యాండర్‌ చివరి క్షణంలో సిగ్నల్స్‌ అందకపోవడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. మరి కొన్ని క్షణల్లో సంబరాలకు సిద్ధంగా ఉన్న శ్రీహరికోటలోని షార్‌ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు నిరాశకు గురయ్యారు. షార్‌ కేంద్రంగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేశారు. గ్రహాంతర ప్రయోగాలు చేసి ఉత్సాహంగా గగన్‌యాన్‌కు ముందడుగు వేస్తున్న ఈ తరుణంలో ఈ విఫలం వారిని ఎంతో బాధకు గురి చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కళ్లల్లో ఒత్తులేసుకుని టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు.

సాక్షి, సూళ్లూరుపేట: జిల్లాలోని షార్‌ కేంద్రంగా ఇప్పటి వరకూ 73 ప్రయోగాలు చేశారు. అందులో పది మాత్రమే విఫలం అయ్యాయి. 2004లోనే గ్రహాంతర ప్రయోగాలకు షార్‌ వేదికగా ఇస్రో శ్రీకారం చుట్టింది. 2008లో చంద్రయాన్‌–1 ప్రయోగించిన అనంతరం చంద్రయాన్‌–2కు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దశాబ్దం పాటు అహర్నిశలు శ్రమ కోర్చి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రదేశాలకు దీటుగా చంద్రయాన్‌–2ను తయారు చేశారు. 2009 నుంచి ఎన్నో ప్రయోగాత్మక ప్రయోగాలు చేశారు. పూర్తి స్థాయిలో అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఈ ఏడాది జూలై 14 జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1  ద్వారా సుమారు 3.6 టన్నుల 

బరువు కలిగిన ఆర్బిటర్‌–విక్రమ్‌ ల్యాండర్‌– రోవర్‌ (ప్రజ్ఞాన్‌) త్రీఇన్‌వన్‌ ప్రయోగాన్ని చేయాలని మహూర్తం నిర్ణయించుకున్నారు. ప్రయోగం మరో గంటలో ఉందనగా ఆఖరి గంటలో కౌంట్‌డౌన్‌ సమయాన్ని నిలిపివేశారు. అయినా నిరాశ చెందకుండా చాలెంజ్‌గా తీసుకుని క్రయోజనిక్‌ దశలో చిన్నపాటి లీకేజీని వారం రోజుల్లో సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. జూలై 22వ తేదీన చంద్రయాన్‌ మిషన్‌ను షార్‌ రెండో నింగిలోకి పంపారు. ఆ తర్వాత అన్ని దశలనూ విజయవంతంగా నిర్వహించారు. అనుకున్న దానికంటే వ్యోమనౌక నింగిలో దూసుకుపోతూ జాబిల్లి చెంతకు పయనిస్తుండడంతో శాస్త్రవేత్తల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది.

ఈ నెల 2వ తేదీన ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విజయవంతంగా విడిపోయింది. ఈ నెల 3, 4 తేదీల్లో ల్యాండర్‌లోని ఇంధనాన్ని మండించి చంద్రుడికి అత్యంత దగ్గరగా తీసుకెళ్లారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటలలోపు చంద్రుడి ఉపరితలంపై దించే ఆపరేషన్‌ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చంద్రుడికి 2.1 కిలో మీటర్లు దూరంలోకి చేరుకున్నాక ల్యాండర్‌ నుంచి బైలాలులోని భూనియంత్రత కేంద్రానికి సిగ్నల్స్‌ తెగిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

ఆ 15 నిమిషాలు..
ముందు నుంచి శాస్త్రవేత్తలు ల్యాండర్‌ దిగే 15 నిమిషాలు ఎంతో కీలకంగా భావించారు. అంతా సవ్వంగా సాగిపోతూ 14 నిమిషాలు దాటిపోయింది. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయి అవాంతరం ఏర్పడింది. ఇస్రో చైర్మన్‌ డాక్టక్‌ కే శివన్‌తో పాటు శాస్త్రవేత్తలంతా కలత చెందారు. పదేళ్లు చేసిన కఠోర శ్రమ, మరో వైపు ప్రయోగం జరిగిన తర్వాత 48 రోజులు పడిన శ్రమ ఇలా అయిందని ఆవేదన చెందారు.

ఏదైనా అద్భుతం జరుగుతుందా!
వికమ్ర్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోతే ప్రయోగం విఫలం అయినట్టు కాదని షార్‌ ఉద్యోగులు అంటున్నారు. ల్యాండర్‌ చంద్రుడి వైపునకు వెళుతున్న సమయంలో దానికి ఉన్న సౌరపలకాలు విద్యుత్‌ సరఫరా చేస్తాయి. అంటే సూర్యుడి కిరణాలు సౌర పలకాలపై ప్రసరిస్తే అందులో నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అయి భూనియంత్రిత కేంద్రానికి సిగ్నల్స్‌ అందజేస్తుంది. ఇది చదవండి : రైతు బిడ్డ నుంచి రాకెట్‌ మ్యాన్‌

సౌర కుటుంబంలోని గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరిగే క్రమంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావడంతో సూర్య కిరణాలు ప్రసరించకపోవడం వల్ల సౌర పలకాల నుంచి విద్యుత్‌ అందకపోవడంతో సిగ్నల్స్‌ అందలేదని వాదన వినిపిస్తోంది. ఒక లూనార్‌ డే అంటే 14 రోజుల పాటు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు ఉంటుందని, ఈ 14 రోజులు గడిస్తే మళ్లీ సౌరపలాకలపై సూర్యకిరణాలు ప్రసరించి విద్యుత్‌ అందజేసిన వెంటనే ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ అందే అవకాశం లేకపోలేదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు