సచివాలయం వద్ద టెన్షన్‌.. టెన్షన్‌

27 Mar, 2018 12:52 IST|Sakshi

సమావేశమైన అఖిల సంఘాలు

పలు రాజకీయ పార్టీల ఆందోళన, అరెస్టు

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు అఖిల సంఘాలు సమావేశమయ్యాయి. సచివాలయంలోని ఒకటో బ్లాకులో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఐదుగురు మంత్రులు హాజరయ్యారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌ బాబు, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శులు పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య హాజరయ్యారు. సీపీఎం తరఫున రాష్ట్ర కార్యదర్శి మధు, వెంకటేశ్వరరావులు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరుకాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్‌లు పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి.

అఖిల సంఘాల భేటీ వద్ద ఉద్రిక్తత
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై విస్తృతంగా చర్చించేందుకు అఖిల సంఘాల సమావేశం నిర్వహిస్తున్నామని, గుర్తింపు పొందిన అన్ని పార్టీలను, ప్రత్యేక హోదా సాధన సమితి తదితర సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హాజరు కావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే మంగళవారం ఉదయం భేటీ జరుగుతున్న సచివాలయం వద్ద పలు రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీఎం సమావేశానికి పిలిచి అవమానించారని నవతరం పార్టీ, వైఎస్‌ఆర్‌  ప్రజాపార్టీ, ముస్లింలీగ్‌ ఆందోళన వంటి పార్టీలు నిరసన తెలిపాయి. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని నేతలు మండిపడ్డారు.

తమతో చర్చంచడానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు పిలిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం డౌన్‌.. డౌన్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

మరిన్ని వార్తలు