మంగళగిరి స్టేషన్ వద్ద ఉద్రిక్తత

27 Mar, 2017 14:11 IST|Sakshi
మంగళగిరి స్టేషన్ వద్ద ఉద్రిక్తత

పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవాణా శాఖ ఉన్నతాధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు ఐదుగురు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లగా, పోలీసు స్టేషన్ గేట్లు కూడా వేసేసి కనీసం ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు స్టేషన్ గేటు వెలుపలే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తోటి శాసనసభ్యులుగా ఆయనను పరామర్శించేందుకు వచ్చిన తమను కనీసం స్టేషన్‌ లోపలకు కూడా అనుమతించకుండా గేట్లు వేసేయడం దారుణమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాసేపు 144 సెక్షన్ ఉందంటున్నారని, మరికాసేపు ఏదో చెబుతున్నారని, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్వయానా ఒక రవాణా కమిషనర్‌కు, ఆయనకు భద్రతగా ఉన్న పోలీసులకు అవమానం జరిగినందుకు నిరసనగా తాము పోరాడుతుంటే ఇప్పుడు పోలీసులు కూడా తమకు సహకరించడం లేదన్నారు.

పోలీసులు అసలు తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఇదే ప్రాంగణంలో ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయని, ఇలా గేట్లు వేసేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గేట్లు మూసేయడానికి కారణం ఏంటో చెప్పాలని తాము రాతపూర్వకంగా అడిగినా జవాబు లేదని, ఇన్‌స్పెక్టర్‌ను అడిగినా స్పందించడం లేదని అన్నారు. 144 సెక్షన్ ఎప్పటి నుంచి ఉందో చెప్పమన్నా సమాధానం లేదని, ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయంటే ఇంతకంటే దారుణం ఏమీ లేదన్నారు. ఇంతోటి దానికి మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టడమా అని బుగ్గన ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు