ముందా.. తర్వాతా?

23 Feb, 2014 00:59 IST|Sakshi
ముందా.. తర్వాతా?

ఎన్నికల నేపథ్యంలో అపాయింటెడ్ డేపై ఉత్కంఠ
అయితే మార్చి 5లోగా, లేదంటే జూన్ 1న?
2రాష్ట్రాల ఏర్పాటుపై అధిష్టానం తర్జనభర్జన
ఇరువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు
తొందరపడితే దెబ్బతింటామంటున్న సీమాంధ్ర నేతలు.. జాప్యం వద్దంటున్న టీ నేతలు
రాష్ట్రంలో ఎన్నికలు తుది విడతలో?

 
సాక్షి, న్యూఢిల్లీ: విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదిం చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే ‘అపాయింటెడ్ డే’ ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అపాయింటెడ్ డే ఖరారుపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా తర్జనభర్జన పడుతున్నాయి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకునే దిశగా సమాలోచనలు చేస్తున్న అధిష్టానం ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషిస్తోంది. అయితే అపాయింటెడ్ డే పై కాంగ్రెస్‌లోని తలపండిన నేతలు కూడా తలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో దానిపై తొందరపాటు నిర్ణయం తగదన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో రాష్ట్రపతి పాలన విధించడం, లేదా మరో సీమాంధ్ర నేత ను సీఎం చేసి ప్రభుత్వాన్ని కొనసాగించడమన్న రెండు మార్గాల కోణం నుంచి చూస్తే అపాయింటెడ్ డే ఖరారు మరింత చిక్కుముడిగా మారుతోంది. దాన్ని వీలైనంత త్వరగా నిర్ణయిస్తే రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులను ఎంపిక చేయాల్సి వస్తుంది. పైగా రెండు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారమూ చిక్కుముడిగా మారుతుందని చెబుతున్నారు. ఆస్తులు, అప్పులు, ఆదాయ పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు వంటి కీలకాంశాలను పూర్తి చేయాల్సిన పనులకు కూడా ప్రతిబంధకంగా మారుతుందని భావిస్తున్నారు.
 
 మార్చి తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ రానుండటం తెలిసిందే. అంటే గట్టిగా మరో 10 రోజులు కూడా లేదు. కాబట్టి యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంటుంది. అపాయింటెడ్ డే ఆలోపు ఉండేలా నిర్ణయిస్తే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అందులోనూ సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపనున్న ప్రభావం 2 లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలపై పడనుంది. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటేయాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. దీన్నెలా అధిగమించడమా అని కేంద్రం పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. అందుకే అపాయింటెడ్ డేను ఇప్పటికిప్పుడు ప్రకటించకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళ్తే దీన్ని అధిగమించవచ్చని కేంద్ర మంత్రి ఒకరు సూచించారు. కానీ ఇంతా చేసి చివరికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే విభజన ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయా అన్న సందేహం కూడా అధిష్టానం పెద్దల్లో నెలకొంది. పైగా, ‘అపాయింటెడ్ డేను జాప్యం చేస్తే తెలంగాణ ప్రజల్లో అపోహలు తలెత్తవచ్చు. ముంపు ప్రాంతాల సమస్య, ఉమ్మడి రాజధాని తదితరాలపై ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటివి జరగవచ్చు. పైగా టీఆర్‌ఎస్ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కష్టం కావచ్చు’ అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు.
 
 మరోవైపు సీమాంధ్ర నేతల నుంచి మరో రకం ఒత్తిళ్లు వస్తుండటం అపాయింటెడ్ డే గందరగోళాన్ని ఇంకా పెంచుతోంది. ‘‘అపాయింటెడ్ డే త్వరగా నిర్ణయిస్తే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విభజించారంటూ ఇప్పటికే సీమాంధ్ర ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్న తరుణంలో అక్కడ వెంటనే ఎన్నికలు పెడితే అస్సలు లాభముండదు. సీమాంధ్రకు ప్రకటించిన ప్యాకేజీని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. అందుకు వీలుగా, సీమాంధ్ర నేతనే ప్రస్తుతానికి సీఎం చేస్తే కొంత మేలు’’ అని పలువురు నేతలు అధిష్టానానికి విన్నవించారు. అయితే విభజనకు కనీసం మూడు నెలలు పట్టవచ్చని జైరాం రమేశ్ శనివారం తనను కలిసిన తెలంగాణ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే వారినుంచి ఒత్తిళ్లు రావద్దనే ఉద్దేశంతోనే అలా చెప్పారన్న వాదన కూడా ఉంది. మరోవైపు... ఇప్పుడు మరో సీఎంను నియమించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, పైగా విభజన ప్రక్రియలో పార్టీ నేతలే ఇబ్బందులు సృష్టించవచ్చని రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే ఎంపీ సందీప్ దీక్షిత్ సూచించినట్టు సమాచారం. కిరణ్ రాజీనామాతో ఒకరకంగా మంచే జరిగింది. రాష్ట్రపతి పాలనతోనే విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయొచ్చు’’ అని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే అపాయింటెడ్ డే మార్చి 5 లోపే ఉండే అవకాశమూ లేకపోలేదని విన్పిస్తోంది. లేదంటే మాత్రం ఎన్నికలయ్యే దాకా ఆగి, జూన్ 1ని అపాయింటెడ డే గా నిర్ణయించవచ్చంటున్నారు.
 
 చివరి విడతలో ఎన్నికలు?
 అపాయింటెడ్ డే వీలైనంత త్వరగా ఉండేలా ప్రకటిస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి విభాగంలో విభజన ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంటుంది. కానీ మార్చి తొలి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచీ అధికారులంతా ఆ కార్యక్రమాల్లో నిమగ్నం కావల్సి వస్తుంది. అలాంటప్పుడు వారు విభజన ప్రక్రియలో భాగస్వాములవడం కష్టమంటున్నారు. దీన్ని అధిగమించడానికి, రాష్ట్రంలో పోలింగ్ వీలైనంత ఆలస్యంగా, అంటే చివరి విడతలో జరిగేలా చూడాలన్న ఆలోచన కూడా కేంద్రం పరిశీలనలో ఉందని సమాచారం. పరిస్థితులను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఆ మేరకు విజ్ఞప్తి చేయవచ్చంటున్నారు.
 
 రెండు పీసీసీలపై కసరత్తు
 రెండు పీసీసీలను ఏర్పాటుపై మాత్రం అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అపాయింటెడ్ డే ఒకవేళ జాప్యమైతే దానికి విరుగుడుగా రెండు ప్రాంతాలకు ముందుగానే వేర్వేరు పీసీసీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ అన్ని అంశాలపైనా సోనియా తన రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో శనివారం సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు ఏర్పడితే సమీకరణాలెలా ఉంటాయి, బలాబలాలేమిటి, పీసీసీ పదవులను ఏ సామాజిక వర్గాలకు కట్టబెడితే ఎలా ఉంటుంది, రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఎవరిని నియమిస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి వంటి అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్, మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు శనివారం సోనియాను కలిశారు. ఇరు ప్రాంతాల్లోనూ పీసీసీ, ఇతర పదవులను బలహీన వర్గాలకు, యువకులకు ప్రోత్సహించాలన్నది రాహుల్ ఆలోచన అని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా