టంగుటూరులో టెన్షన్.. టెన్షన్

21 Jan, 2014 06:34 IST|Sakshi
  •   ‘టంగుటూరులోని నాగేశ్వర స్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’
  •  ్చ ఓ మహిళ దాఖలు చేసిన ప్రజాప్రయోజన  వ్యాజ్యంపై దేవాదాయశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
  • టంగుటూరులోని పోతుల వెస్ట్ కాలనీలో 1,250 మంది ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పొందారు. వీరిలో 600 మంది అనర్హులని అధికారులు ఆలస్యంగానైనా గుర్తించారు.
  • 600 మందికి నోటీసులిచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
  •  టంగుటూరులో మెయిన్ రోడ్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
  •  ఆర్‌ఓబీ నిర్మాణం వల్ల పంచాయతీ కాంప్లెక్స్‌లతో పాటు పలువురి ఇళ్లు, ప్రైవేట్ వ్యాపార సముదాయాలు తొలగించనున్నారు.  
  • టంగుటూరులో తమకు చెందిన 10 ఎకరాల ఈనాం భూములను ఆక్రమించుకున్నారని కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టులో పోరాడుతున్నారు.
  •  ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్ ఈ భూమిలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు.
  •   ఈ నాలుగు అంశాలు టంగుటూరులో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినా వీటి గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతుందడగా.. సంఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి.             - న్యూస్‌లైన్, టంగుటూరు
     
     
     రాజీవ్‌నగర్ వాసుల్లో కలవరం
     టంగుటూరులో 1977లో ఓ ప్రదేశంలో పేదల గుడిసెలు వెలిశాయి. కాలక్రమంలో గుడిసెల స్థానంలో పక్కా భవనాలు నిర్మించారు. కొందరు వ్యక్తులు అక్కడ స్థలాలను విక్రయించి వెళ్లిపోయారు. కొనుగోలు చేసిన వారు భవనాలు నిర్మించుకున్నారు. కాలనీకి రాజీవ్‌నగర్  అని పేరుపెట్టారు. ఇక్కడ 100 పక్కా గృహాలున్నాయి. అధికారులు ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఓ మహిళ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)తో అసలు విషయం బయటపడింది. ఆ భూములు నాగేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవని, మొత్తం 6 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని నిరూపితమైంది. పిల్‌పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ‘దేవుడి మాన్యంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న గృహాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ అని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ కాలనీ వాసులు స్టే కోసం సుప్రీం కోర్టు మెట్లెక్కారు. స్టే కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. దేవాదాయ శాఖ మాత్రం రాజీవ్‌నగర్‌ను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది.
     
     పోతుల వెస్ట్ కాలనీలో అనర్హులకు నోటీసులు సిద్ధం
     టంగుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అధికారులు 50 ఎకరాల దేవాదాయ భూమిని సేకరించారు. 2009లో పోతులవెస్ట్ కాలనీ పేరుతో సుమారు 1,250 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇప్పటికే చాలా మంది పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పలు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ స్థలాల్లో అనర్హులకు పట్టాలు కట్టబెట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గత ఏడాది మార్చిలో విచారణకు ఆదేశించించింది. విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. స్థలాలు పొందిన వారిలో 600 మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులిస్తే ఏం సమాధానం చెప్పాలో అంతుబట్టక పలువురు లబ్ధిదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
     
     గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న ఆర్‌ఓబీ
     రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ).. ఈ మాట టంగుటూరు గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. టంగుటూరు మెయిన్‌రోడ్డులో ఆర్‌ఓబీ నిర్మిస్తుండటమే ఇందుకు కారణం. పంచాయతీ కార్యాలయం నుంచి రైల్వే గేటు మీదుగా కొండపి రోడ్డులో కామనివారికుంట వరకు ఉన్న మెయిన్‌రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు పంచాయతీ మార్కెట్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ మార్కెట్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థలు, ఇళ్లు.. ఇలా ఆదాయాన్ని సమకూర్చే వనరులన్నీ మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. ఆర్‌ఓబీ నిర్మాణంతో ఇవన్నీ కూలే అవకాశముంది. నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని రైల్వే ఉన్నతాధికారులను కలిసి టంగుటూరు వాసులు విన్నవించారు. సమస్యను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జనం మాటలు వారు వినకపోగా.. ఆర్‌ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో మట్టి శాంపిల్స్ కూడా సేకరించడంతో గ్రామస్తుల్లో ఆందోళన ఎక్కువైంది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
     
     ‘కుమ్మరి ఈనాం భూములు మావే’
     టంగుటూరులో సుమారు పది ఎకరాల కుమ్మరి ఈనాం భూములకు అసలైన వారసులం తామేనంటూ కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఐదేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేశారు. తమ పూర్వీకుల పేరున ఉన్న కుమ్మరి ఈనాం భూములను తమకు స్వాధీనం చేయాలని వారు పోరాడుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ 10 ఎకరాల భూములు గ్రామంలో ఆర్థికంగా బలవంతులైన వారి చేతిలో ఉన్నాయి. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్‌ను ఈ భూముల్లో నిర్మించారు. ఈ విషయంపైనా గ్రామంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు