పదింతలు మెరుగయ్యేలా..

25 Feb, 2015 00:34 IST|Sakshi

విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు తరుముకొస్తున్నాయి. కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 26వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక బోధనపై  ఉపాధ్యాయులకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ క్లాసులు ఇటీవల మొదలయ్యాయి. గత ఏడాది జిల్లాలో వచ్చిన 91.8 శాతం ఉత్తీర్ణతను మెరుగుపర్చేందుకు ప్రణాళికలకు రూపొందిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత శ్రద్ధచూపితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మొదటి ఐదు స్థానాలలో జిల్లా నిలిచే అవకాశం  ఉంటుందని జిల్లా విద్యాశాఖ భావిస్తోంది.
 
 జిల్లాలో 360 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 29,841 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 170 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానం అమ ల్లోకొచ్చాక ర్యాంకుల పోటీ తగ్గిపోయినా చాలా పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్లాయి. సమ్మేటివ్ (త్రైమాసిక, అర్ధవార్షిక) పరీక్షల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులు  ఉన్నారు, అలాగే ఆ పరీక్షల్లో వెనుకబడిన వారూ ఉన్నారు. వీరిని పాఠశాల స్థాయిలో బేరీజు వేసుకుని  వార్షిక పరీక్షలకు సిద్ధంచేస్తున్నారు. ఈ మేరకు ఉత్తీర్ణతా శాతం బాగా పెరగవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రణాళికతో ముందుకెళ్తే జిల్లాకు ప్రస్తుతమున్న 8వ స్థానాన్ని నూతన ఆంధ్రప్రదేశ్‌లో మెరుగుపర్చుకునే అవకాశముంది.  మరి లక్ష్య సాధన లో పురోగమిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
 
 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ
 విద్యలో ప్రమాణాలు సాధించేందుకు జిల్లా లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. వాస్తవానికి 10వ తరగతి విద్యార్థులకు గత  ఏడాది నవంబర్  నుంచి ప్రతి రోజూ సాయంత్రం అదనంగా గంట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఇక నుంచి పునశ్చరణ తరగతులు మొదలవుతున్నాయి.  పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యాశాఖ నూతన కార్యాచరణ ప్రకారం ఉదయం 8.30గంటల నుంచి ప్రత్యేక పునశ్చరణ తరగతులు ప్రారంభించి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయకుండా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వివిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు  రాబట్టాలని నిర్ణయించారు. బ్లూప్రిం ట్ ప్రకారం విద్యార్థుల  సంసిద్ధత, చర్చలు, సమీక్షల ద్వారా ప్రతిభా ప్రగతికి ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవుల రోజున ఏదో ఒక సబ్జెక్ట్ టీచర్ రోజంతా ఉండి విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలో ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలనే దానిపై సిద్ధం చేస్తున్నారు.
 
 ఉత్తీర్ణతా శాతం పెంపునకు ప్రణాళికలు
 పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గత ఏడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు వేశామని డీఈఓ కృష్ణారావు అన్నారు. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 91.8 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది కొత్తరాష్ట్రంలో మరింత మెరుగుపడేలా పాఠశాలస్థాయిలో ప్రణాళికలు వేశామని చెప్పారు. వచ్చేనెల మొదటివారంలో జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్థ్యంపై ఒక అంచనా వస్తుందని తెలిపారు. నిర్ణీత టైమ్ టేబుల్ ప్రకారం ప్రత్యేక ప్రణాళికను పూర్తిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
 

>
మరిన్ని వార్తలు