సీసీ కెమెరాల నిఘాలో స్పాట్‌ వాల్యుయేషన్‌

2 Apr, 2018 06:51 IST|Sakshi
స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలోని స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం

నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నిర్వహణ

జిల్లాలో 2,100 మంది ఉపాధ్యాయుల నియామకం

గైర్హాజరైన పక్షంలో కఠిన చర్యలు

బార్‌ కోడింగ్‌ విధానంలో మూల్యాంకనం

డీఈవో గంగా భవానీ

గుంటూరు ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకనం (స్పాట్‌ వాల్యూయేషన్‌) ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు విధిగా గుర్తింపు కార్డును ధరించడంతో పాటు సెల్‌ఫోన్లు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. ఒక్కసారి స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంలోకి అడుగుపెట్టిన ఉపాధ్యాయులు సాయంత్రం మూల్యాంకనం ముగిసేవరకూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేని విధంగా విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

జిల్లా వ్యాప్తంగా 2,100 మంది ఉపాధ్యాయుల నియామకం
నగరంపాలెం స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలోని స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంలో క్యాంప్‌ అధికారి, డీఈవో ఆర్‌.ఎస్‌ గంగా భవాని పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 2,100 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ నియమించింది. వీరిలో అసిస్టెంట్‌ క్యాంప్‌ అధికారులతో పాటు చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తాగునీరు, క్యాంటిన్, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్‌లో నామమాత్రపు ధరకు ఆహారంతో పాటు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మినరల్‌ వాటర్‌ సదుపాయం కల్పిస్తున్నారు. గతేడాది వరకు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటినే నేరుగా ఉపాధ్యాయులకు అందిస్తూ రాగా గుంటూరు నగరంలో ఇటీవల డయేరియా ప్రబలిన నేపథ్యంలో కూలింగ్‌ వాటర్‌ క్యాన్లు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు.

జిల్లాకు చేరుకున్నఆరు లక్షల స్క్రిప్ట్‌లు
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి ఆరు లక్షల స్క్రిప్ట్‌లు జిల్లాకు వచ్చాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ రోజుకు 40 స్క్రిప్ట్‌లకు మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందని డీఈవో ఆర్‌.ఎస్‌ గంగా భవానీ చెప్పారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ విధి నిర్వహణకు నియామకం పొందిన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 8.30 గంటలకు స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఉపాధ్యాయులను రిలీవ్‌ చేసి పంపాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విధులకు గైర్హాజరైన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో శ్రమకోర్చి పరీక్షలు రాసిన ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలిగించని రీతిలో ప్రశ్నపత్రాలకు పకడ్బందీగా మూల్యాంకనం జరపడంతో పాటు వచ్చిన మార్కులను చీఫ్‌ ఎగ్జామినర్లు, కోడింగ్‌ అధికారులతో పాటు అసిస్టెంట్‌ క్యాంప్‌ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు చేçపడుతున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు