తండ్రి మరణం...40 గంటల నిరీక్షణం

27 Mar, 2018 11:57 IST|Sakshi
శ్రీనివాసరావు మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య ,మురమళ్ల జెడ్పీ పాఠశాలలో పరీక్షకు హాజరైన నూలు కౌశిక్‌

దుఃఖాన్ని దింగమింగుకుని‘పది’ పరీక్ష రాసిన కొడుకు

దిక్కు కోల్పోయి అయోమయంతో

బీటెక్‌ పూర్తి చేసిన కవల కూతుళ్లు

‘పది’లమైన జీవితానికి అడుగులు వేస్తూ.. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు ఆ విద్యార్థులు..అయితే విధి ఆడిన వింతనాటకంలో కన్నవారిని కోల్పోయారు. ఆ బాధను దిగమింగుకుని పరీక్షలు రాస్తున్నారు.

ఐ.పోలవరం (ముమ్మిడివరం):  పది రోజులుగా పదో తరగతి పరీక్షలు రాస్తూ.. తన జీవిత లక్ష్యాలకు పునాదులు వేసుకుంటున్నాడు ఆ బాలుడు. ఇంతలో పరాయి రాష్ట్రంలో అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం స్వగ్రామంలోని ఇంటికి చేరేదాకా మధ్యలో ఆ కుర్రాడు పడిన మనోవేదన వర్ణనాతీతం. ఒడిశా రాష్ట్రం రాయగడలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి నూలు శ్రీనివాసరావు(44) ఒకరు. ఆయన కుమారుడు కౌశిక్‌ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అమలాపురానికి చెందిన శ్రీనివాసరావు బావ హోమ ద్రవ్యాల హోల్‌ సేల్‌ వ్యాపారి శ్రీకాకోళపు సుబ్రహ్మణ్యంతో పాటు మరో బంధువైన అమలాపురం రూరల్‌ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామ వాసి సూర్యనారాయణ ఈ ప్రమాదంలో ముగ్గురు రక్త సంబంధీకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం  పరాయి రాష్ట్రంలో జరగడం వల్ల మృతదేహాలు 40 గంటల తర్వాత అంటే సోమవారం తెల్లవారు జామున స్వగ్రామాలకు చేరాయి.

పిల్లలను బాగా చదివించాలని..
శ్రీనివాసరావు తనకు ఉన్నంతలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ తన పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలన్న తపనతో ఉండేవాడని మురమళ్ల గ్రామస్తులు అంటున్నారు. భార్య, ఇద్దరు కవల ఆడపిల్లలు, ఒక కుమారుడితో సాగిపోతున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇద్దరు కవల ఆడపిల్లలు బీటెక్‌లు పూర్తి చేశారని, వారికి పెళ్లిళ్లు చేయకుండానే శ్రీనివాసరా>వు వారికి దూరమయ్యాడని స్థానికులు వాపోతున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న కౌశిక్‌ తండ్రి మృతదేహం కోసం రోజున్నర పాటు ఎదురు చూసి వేదనతో గడిపాడు.

కడసారి కన్నతండ్రిని చూసి పరీక్ష హాలుకు..
సోమవారం తెల్లవారు జామున ఇంటికి తరలించిన తండ్రి మృతదేహంపై పడి తల్లి, అక్కలతో కలసి ఏడ్చిన కొడుకు కౌశిక ఉదయం ఎనిమిదయ్యాక దుఃఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాసేందుకు పయనమయ్యాడు. బంధువులు కూడా పదో తరగతి పరీక్షలకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయడంతో కౌశిక్‌ మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి సోషల్‌ పేపర్‌–1 పరీక్ష రాశాడు. శ్రీనివాసరావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ పరామర్శించి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు