చదువుతుండగా...

20 Mar, 2020 13:20 IST|Sakshi
లక్కవరపుకోట : మృతి చెందిన భూమిరెడ్డి అప్పలనాయుడు

పిడుగుపాటుకు విద్యార్థి దుర్మరణం

నాలుగు సంవత్సరాల కిందట తండ్రి మృతి

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

భూమిరెడ్డిపాలెంలో విషాదఛాయలు

లక్కవరపుకోట: భవిష్యత్‌లో ప్రయోజకుడై ఆదుకుంటాడనుకుని ఆ తల్లి బిడ్డను కళ్లల్లో పెట్టి చూసుకుంది. నాలుగు సంవత్సరాల కిందట తండ్రి చనిపోతే ఆ లోటు తెలియకుండా పెంచుతూ వచ్చింది. మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని ఆశ పడిన ఆ తల్లికి పుత్రశోకం మిగిలింది. మరో పది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఆ విద్యార్థి పిడుగు పాటుకు బలైపోయాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలో గురువారం మధ్యాహ్నం పిడిగులతో కూడిన వర్షం పడింది. భూమిరెడ్డిపాలెంలో గ్రామానికి చెందిన భూమిరెడ్డి అప్పలనాయుడు (16) తోటి విద్యార్థులతో కలసి గురువారం మధ్యాహ్నం మంచంపై చదువుకుంటుండగా... ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో అప్పలనాయుడు కుప్పకూలిపోవడంతో వెంటనే సమీపంలో ఉన్నవారు స్పందించి 108 వాహనంలో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు.  అయితే అప్పటికే అప్పలనాయుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే విద్యార్థి చందులూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తోటి పిల్లలతో కలిసి చదువుకుంటున్నాడు. ఇంతలో పిడుగు పడడంతో అప్పలనాయుడు మృతి చెందాడు. నాలుగు సంవత్సరాల కిందటే విద్యార్థి తండ్రి మృతి చెందడంతో తల్లి పద్మ కష్టపడి కుమారుడ్ని పెంచింది. నన్నెవరు పెంచుతారురా... కన్నా...అంటూ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది.

పాడి గేదె, రెండు మేకలు
 మండలంలోని రేగ గ్రామానికి చెందిన రావాడ శ్రీరామ్మూర్తికి చెందిన పాడి గేదె మృతి చెందింది. పశువుల పాక వద్ద ఒక్కసారిగా పిడుగు పడడంతో గేదె అక్కడికి అక్కడే మృతి చెందినట్లు రైతు శ్రీరామ్మూర్తి తెలిపారు. గేదె విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని అంచనా. అలాగే  కళ్లేపల్లి గ్రామానికి చెందిన కడియాల మంగయ్య, కోరాడ శ్రీనులకు చెందిన రెండు మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. గ్రామానికి సమీపంలో గల పొలంలో మేకల మంద కాస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు.

సరయ్యవలసలో 18 మేకలు..
దత్తిరాజేరు: మండలంలోని సరయ్యవలసలో గురువారం సాయంత్రం పిడుగు పడడంతో 18 మేకలు మృతి చెందినట్లు వైఎస్సార్‌సీపీ నాయకుడు సారికి రామునాయుడు తెలిపారు. తట్టబోను లకు‡్ష్మ అప్పారావు, అప్పలస్వామి, తదితరులు గ్రామ సమీపంలో మేకల మంద కాస్తుండగా.. పిడుగు పడడంతో ఒక్కసారి 18 మేకలు మృతి చెందాయి. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నాయకులు   మంత్రి అప్పలనాయుడు, మండల శ్రీనువాసాసరావు, సారికి అప్పలనాయుడు, సాలాపు పాపారావు, టీడీపీ నాయకులు చప్ప చంద్రశేఖర్, బెజవాడ బంగారునాయుడు పరామర్శించారు.

పిడుగు పడి గొర్రెల కాపరి ..
జామి: మండలంలోని అలమండ పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పిడుగు పడడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వియ్యపు రమణ (46) అనే వ్యక్తి, బోగ రాములమ్మ, తదితరులు పద్మనాభం మండలం గంధవరం కోమటి చెరువు వద్ద గొర్రెలు కాస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడడంతో రమణ అక్కడికక్కడే మృతి చెందగా.. రాములమ్మ అస్వస్థతకు గురైంది. ఆమెను అలమండ పీహెచ్‌సీకి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు రమణకు భార్య రమణమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు