‘టెన్త్’ ఫీజు గడువు వచ్చే నెల 21

27 Sep, 2013 02:48 IST|Sakshi

ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు చెల్లించొచ్చు
 సాక్షి, హైదరాబాద్: మార్చి 2014లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వచ్చే నెల 21లోగా పరీక్ష ఫీజును సంబంధిత ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ. 125.. మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాలనుకునేవారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలనుకునే వారు రూ. 125 ఫీజును చెల్లించాలన్నారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు, ఇతర రాష్ట్ర, ఇతర దేశ విద్యార్థులు నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించవచ్చన్నారు.
 
 ఇక రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 4 వరకు.. రూ. 200 ఆలస్య రుసుముతో నవంబర్ 18 వరకు.. రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ప్రైవేటుగా పరీక్షలు రాసే వారు హాజరు మినహాయింపు ఫీజుగా రూ. 650 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రూ. 650 స్పెషల్ ఫీజు చెల్లించాలని, వారు కచ్చితంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్లో (www.bseap.org)డీఈవో కార్యాలయాల్లో పొందవచ్చని పేర్కొన్నారు. కాగా.. వొకేషనల్ అభ్యర్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా రూ. 60 చెల్లించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెగ్యులర్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ. 24 వేలు, గ్రామాల్లో రూ.20 వేలలోపు ఉంటే ఫీజు మినహాయింపు పొందవచ్చని తెలిపారు.

>
మరిన్ని వార్తలు