వైఎస్‌ జగన్‌ను కలిసిన కౌశిక తల్లిదండ్రులు

21 Nov, 2017 11:20 IST|Sakshi

సాక్షి, కర్నూలు :  ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యం వల్ల ట్రిపుల్‌ ఐటీలో సీటు కోల్పోయిన విద్యార్థిని కౌశిక తల్లిదండ్రులు మంగళవారం వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన కౌశిక ఏపీ మోడల్‌ స్కూల్‌లో 2017 సంవత్సరంలో 9.5 జీపీఏతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది.  రీ వెరిఫికేషన్‌లో హిందీలో మూడు మార్కులు పెరిగి, కౌశికకు 9.7కి జీపీఏ పెరిగింది. అయితే టెన్త్‌ బోర్డు సకాలంలో గ్రేడ్‌ మార్చకపోవడంతో ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీ సీటు కోల్పోయింది.

దీంతో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఇవాళ కౌశిక పేరెంట్స్‌ శ్రీవాణి, విష్ణువర్థన్‌ రెడ్డి కలిసి, తమ ఆవేదన తెలిపారు. తన కుమార్తెకు ట్రిపుల్‌ ఐటీలో సీటు ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ను కోరారు. కౌశికకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డితో చర్చించిన ఆయన, జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడాలని సూచించారు.

మా పాపకు సీటు కావాలి...
కౌశిక తల్లి శ్రీవాణి మాట్లాడుతూ...‘వైఎస్‌ జగన్‌కు తమ గోడు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ మండలం అల్లూరు నుంచి ప్రజాసంకల్పయాత్రకు వచ్చాం. మా పాపకు ఎస్‌ఎస్‌సీలో 2017లో 9.5 పర్సంటేజ్‌ వచ్చింది. రీ వెరిఫికేషన్‌ పెట్టుకుంటే మూడు మార్కులు పెరిగినా గ్రేడ్‌ మాత్రం పెరగలేదు. మండల టాపర్‌ అయినా ఇంత అన్యాయం జరిగింది. వెంటనే ఇడుపులపాయకు వెళ్లి కలుస్తే అడ్మిషన్‌లు పూర్తయ్యాయి అని చెప్పారు. తరువాత తాడేపల్లిలో వీసీని కలిస్తే కమిషనర్‌ నుంచి లెటర్‌ తీసుకురమ్మన్నారు.

కమిషనర్‌ను కలిస్తే లెటర్‌ ఇచ్చారు. కానీ ట్రిపుల్‌ ఐటీలో లెటర్‌ బేస్‌ చేసుకొని సీటు ఇవ్వలేమంటున్నారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యంతో మా పాప చదువుకు ఆటంకం కలిగింది. వైఎస్‌ జగన్‌ను కలవడంతో ఆయన మాకు భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే విధంగా చూస్తానని ధైర్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన తర్వాత నెత్తిమీద పెద్ద భారం దిగినట్లు అయింది. మాకు భరోసా లభించింది.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు