దృశ్య మనోహరం

11 Jan, 2014 02:52 IST|Sakshi
హంసవాహనంపై నదీవిహారం

భద్రాచలం, న్యూస్‌లైన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో శుక్రవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో  శ్రీరామునికి  తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో భక్తులు ఈ వేడుకను కనులారా వీక్షించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి గర్భగుడిలో దర్బారు సేవ నిర్వహించి, ఉత్సవ మూర్తులకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు.  ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై అళ్వార్ పరమపదోత్సవం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతితో పగల్ పత్తు ముగిసింది.  
 
 అనంతరం వేదపండితులు మంత్రాలు చదువుతుండగా..., మంగ ళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ  ఆలయం నుంచి స్వామి వారిని ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకు వెళ్లారు.  గోదావరి నదిలో విహరించేందుకు  రాజాధిరాజ వాహనంపై బయలుదేరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని చూసి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరానికి చేరిన తరువాత అర్చకులు ముందుగా  పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామివారికి ఆలయ ఈఓ రఘునాథ్ గుమ్మడికాయతో  దిష్టి తీసిన అనంతరం హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు కూడా  పూజలు చేశారు.
 
 ఈ సందర్భంగా  వేదపండితులు చతుర్వేదాలు, నాలాయిర దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. అనంతరం మంగళహారతి ఇచ్చి, ప్రసాద నివేదన చేశారు. తరువాత రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది.  గోదావరి నదిలో ఐదు సార్లు స్వామి వారు హంసవాహనంపై విహరించారు.   విహారం మొదలైనప్పటి నుంచి ఉత్సవం పూర్తి అయ్యేంత వరకూ బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చారు. మిరిమిట్లు గొలిపే వె లుగులతో గోదావరి తీరం పున్నమి కాంతులీనింది. తెప్పోత్సవం సమయానికి గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. బాణసంచా వెలుగులు, విద్యుత్ దీపాల కాంతుల నుడుమ హంసవాహనంపై స్వామి వారు గోదావరి నదిలో విహరిస్తున్నంత సేపు నదీతీరం రామనామ జయ జయ ధ్వానాలతో మార్మోగింది.
 
 ఆకట్టుకున్న కోలాటాలు...
 రాజాధిరాజ వాహనంపై తెప్పోత్సవానికి స్వామి వారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ  కోలాట సంస్థల ఆధ్వర్యంలో మహిళలు చేసిన కోలాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.   కీర్తనలు ఆలపిస్తూ వేద విద్యార్థులు..,  వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలి, శ్రీ సాయి వాసవీ మహిళా కోలాట సమితి, గోవిందరాజ స్వామి కోలాట సమితికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.


 కలెక్టర్, ఎస్పీ పూజలు..
 స్వామివారిని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్, ఎస్పీ రంగనాథ్, భద్రాచలం ఆర్‌డీవో కాసా వెంకటేశ్వర్లు సతీ సమేతంగా దర్శించుకొని పూజలు చేశారు. అదే విధంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాల్వంచ ఆర్‌డీవో శ్యాంప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు.  తెప్పోత్సవం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భద్రాచలం పట్టణ  సీఐ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పోలీసులు పర్యవేక్షించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈవో శ్రావణ్ కుమార్, ఆలయ పీఆర్‌వో సాయిబాబా, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్ కుమార్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు