ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్ర అలర్ట్‌

25 Aug, 2019 08:46 IST|Sakshi

తీరంలో ముమ్మర తనిఖీలు

షార్, కృష్ణపట్నం, ఆర్థిక మండళ్ల వద్ద పటిష్ట బందోబస్తు

సాక్షి, నెల్లూరు: తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యంగా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం, కృష్ణపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో పాటు స్థానిక పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు. తీరం వెంబడి కోస్ట్‌గార్డ్,  మెరైన్, స్థానిక పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. మత్స్యకార గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహించి కొత్తవ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించినా, అనుమానస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే సమాచారం అందించాలని సూచనలు చేస్తున్నారు. జిల్లాలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలిచ్చారు.  ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా రెండురోజులుగా పోలీసు అధికారులు జిల్లాను జల్లెడ పట్టారు. పర్యటన రద్దు అయినా తనిఖీలను కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు