‘తీవ్ర’ అలజడి

6 Oct, 2013 04:03 IST|Sakshi

సాక్షి, చిత్తూరు:
 జిల్లాలోని పుత్తూరులో ఇద్దరు తీవ్రవాదులు శనివారం పట్టుబడ్డారు. ఆరేళ్ల క్రితం మదనపల్లెలో షెల్టర్ తీసుకున్న పేరు మోసిన ఒక కాశ్మీర్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. తర్వాత ఏకంగా పుత్తూరులో ఏడాదిగా కాపురం ఉంటూ తీవ్రవాదులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా నేతృత్వంలో తమిళనాడు, ఆంధ్ర  పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు పుత్తూరు ఆపరేషన్‌లో కాల్పులు జరపకుండా టియర్ గ్యాస్ ప్రయోగించి తీవ్రవాదులను అరెస్టు చేశారు. ముందుగా  తీవ్రవాదులు బయట ప్రాంతాల వారితో మాట్లాడకుండా జామర్లు పెట్టి మొబైల్ సిగ్నల్స్ లేకుండా చేశారు. పట్టుబడిన తీవ్రవాదుల ఇంట్లో పేలుడు పదార్థాలు తయారీకి ఉపయోగించే విడి పరికరాలు పోలీసులకు దొరి కాయి.
 
  ఒక పిస్టల్, రెండు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల తీవ్రత ఎక్కువని చెప్పిన జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా ఆ తరువాతే తిరుమలలో ఉన్న తీవ్రవాద వ్యతిరేక పోరాట దళం(ఆక్టోపస్) కమాండోలను యుద్ధప్రాతిపదికన రం గంలోకి దించారు. ఉదయం సమాచారం అం దిన వెంటనే ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి తీవ్రవాదుల ఆట ఎలా కట్టించాలనే దానిపై తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అనుక్షణం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తూ ఇం టి లోపలున్న మహిళ, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసి, విజయవంతం గా పుత్తూరు ఆపరేషన్ పూర్తి చేశారు. తీవ్రవాదులను చెన్నయ్ పోలీసులకు అప్పగించారు.
 
 ఎవరికీ అనుమానం రాకుండా....
 పుత్తూరులో ఏడాదిగా గేటు పుత్తూరులోని మేదరవీధిలో బిలాల్, ఇస్మాయిల్ తమ కుటుంబం సహా కాపురం ఉంటున్నారు. పెంకుటింట్లో తీవ్రవాది బిలాల్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు  ఉండేవారు. పక్కనే ఉన్న ఇంటి మిద్దిపైన గదిలో ఇస్మాయిల్ ఉండేవాడు. శనివారం బాంబు స్క్వాడ్ ఒక ట్రంకు పెట్టెను స్వాధీనం చేసుకుంది. ఇందులో పెద్ద ఎత్తున కరెన్సీ ఉన్నట్లు సమాచారం. అలాగే బాంబులు తయారు చేసేందుకు వాడే విడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
  తిరుమల బ్రహ్మోత్సవాలు, రద్దీ ప్రాంతాలు, ఆలయాల వద్ద బాంబులు పేల్చాలనే లక్ష్యంతో పేలుడు పదార్థాలు తయారీ సొంతంగా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల తీవ్రవాదులు అలిపిరి ప్రాంతంలో, సీఎం సొంత ఊరు నగరిపల్లె వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీరికి ఏఏ తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కోణంలోనూ నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. మేదరవీధిలో ఇరుగు పొరుగు వారితో కూడా తక్కువ సంబంధాలు కలిగి, బయట కూడా మౌనంగా ఉండేవారని ఆ వీధి వాసులు చెబుతున్నారు.
 
 నిద్రపోతున్న నిఘా సంస్థలు:
 తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా వేసేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం యూనిట్ తిరుపతిలో ఉంది. ఈ యూనిట్‌ను హైదరాబాదు నుంచి ఉన్నతాధికారులు సమన్వయం చేస్తుం టారు. తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా మొత్తం మీద అనుమానితుల కదలికలు, గతంలో తీవ్రవాద చరిత్ర ఉండి జిల్లాలో సంచరిస్తున్నవారు ఎవరైనా ఉంటే తిరుపతిలోవారి వివరాలు ఈ నిఘా సంస్థ ఆరా తీయాలి. వీరితో పాటు  కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తిరుపతిలో ఉంది. ఇవికాకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ తరహా కదలికలపై నిఘా వేసి ప్రత్యేక సమాచారం తెలుసుకునేందుకు స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు ఉన్నారు. ఇన్ని నిఘా సంస్థలు ఉన్నా ఏడాదిగా పుత్తూరులో తీవ్రవాదులు ఏకంగా కాపురం పెట్టి, స్టీల్ సామాన్లు అమ్మే వారిగా చలామణి అయ్యారంటే మన నిఘా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందనేది అర్థమవుతోంది.  పుత్తూరులో తీవ్రవాదులు ఉన్నారని విషయం తమిళనాడు పోలీసులు చెబితేనే  తెలిసింది. జిల్లాలో ఇంకా ఎవరైనా తీవ్రవాదులు తలదాచుకున్నారని నిఘా సంస్థలు ఆరా తీస్తే మంచిది.
 

మరిన్ని వార్తలు