బ్రహ్మోత్సవాలపై ఉగ్ర గురి!

6 Oct, 2013 01:42 IST|Sakshi
బ్రహ్మోత్సవాలపై ఉగ్ర గురి!

సాక్షి, పుత్తూరు/చిత్తూరు/చెన్నై/హైదరాబాద్‌: తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉగ్రవాదుల కన్ను పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో రక్తపాతం సృష్టించేందుకు ముష్కరులు భారీ కుట్ర పన్నారు. స్వామివారికి పట్టే గొడుగుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే తమిళనాడు పోలీసులు, రాష్ట్ర పోలీసులు, ఆక్టోపస్‌ కమాండో బృందాల సాహసోపేతమైన 11 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌తో ఈ కుట్ర భగ్నమైంది. లేదంటే ఉగ్రవాదులు బ్రహ్మో త్సవాల్లో బీభత్సం సృష్టించేవారని నిఘా, పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడులో పోలీసులకు చిక్కిన ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశారు.

 

ఆపరేషన్‌లో పాల్గొన్న తమిళనాడు ఎస్‌ఐబీ సీఐ లకష్మణ్‌ను ఉగ్రవాదులు కత్తులతో పొడిచారు. ఆయన చెనై్నలో చికిత్స పొందుతున్నారు. శనివారం తెల్లవారుజాము 3.30 నుంచి రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్‌కు పుత్తూరు వేదికైంది. ఏ క్షణానికి ఏమౌతుందోనన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు రాష్ట్రంలో.. అదీ తిరుమలకు అతి సమీపంలో మకాం వేశారని తెలిసి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

చెనై్నలో ఉగ్రవాది అరెస్టుతో కదిలిన డొంక..

ఫక్రుద్దీన్‌.. అలియాస్‌ పోలీస్‌ ఫక్రుద్దీన్‌.. ఇస్లామిక్‌ డిఫెన్‌‌స ఫోర్‌‌స (ఐడీఎఫ్‌) సంస్థకు చెందిన ఈ కరుడుగట్టిన ఉగ్రవాది తన ఇద్దరు అనుచరులతో శుక్రవారం రాత్రి చెనై్నలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా పుత్తూరులో ఉగ్రవాదుల జాడ తెలిసింది. బాంబులు తయారీ, అమర్చడం, పేల్చడం తదితరాల్లో ఫక్రుద్దీన్‌ సిద్ధహస్తుడు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో కల్లోలం సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెనై్న పోలీస్‌ కమిషనర్‌ జార్‌‌జకు సమాచారం అందడంతో పెరియమేడులోని ఒక లాడ్జిపై దాడి చేశారు. గదిలో దాగి ఉన్న పోలీస్‌ ఫక్రుద్దీన్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదులు బిలాల్‌ మాలిక్‌, పన్నా ఇస్మాయిల్‌ ఉన్నారన్న సమాచారం సేకరించారు.

పక్కింటివాళ్లమంటూ తలుపు తట్టిన పోలీసులు..


విచారణలో ఫక్రుద్దీన్‌ వెల్లడించిన విషయాలను చిత్తూరు ఎస్పీ కాంతిరాణా టాటాకు తమిళనాడు ఎస్‌ఐబీ ఐజీ వివరించారు. నగరి సీఐ శివభాస్కర్‌రెడ్డి సహకారంతో శనివారం తెల్లవారుజామునే తమిళనాడు పోలీసులు పుత్తూరు చేరుకున్నారు. ఉగ్రవాదులున్న మేదర వీధిలోని ఇంటి వద్దకు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ లకష్మణ్‌ తొలుత తలుపులు తట్టారు. పక్కింటివాళ్లమని చెబుతూ వారిని పిలిచారు. ఉగ్రవాదులు తలుపులు తీయగానే పోలీసులు లోపలికి ప్రవేశించారు. తేరుకున్న ఉగ్రవాదులు లకష్మణ్‌పై కత్తితో దాడికి దిగారు. ఆయనతో పాటు లోపలికి వెళ్లిన కానిస్టేబుల్‌పైనా రాడ్డుతో దాడిచేశారు. దాంతో ఆ వెనుకే ఉన్న మరో పోలీసు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌ కడుపులోకి బులెట్‌ దూసుకెళ్లింది. పక్కనే ఉన్న బిలాల్‌ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు బయటకు వచ్చేశారు. ఉదయం 7 గంటలప్పుడు చిత్తూరు ఎస్పీ కాంతిరాణా ఘటనా స్థలికి చేరుకున్నారు. డీజీపీ ప్రసాదరావుకు పరిస్థితిని వివరించి అదనపు బలగాలను కోరారు. తిరుమల ఆక్టోపస్‌ కమాండో యూనిట్‌ను పుత్తూరు తరలించారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఆపరేషన్‌ పూర్తిచేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాల జారీ చేశారు. ఆక్టోపస్‌ కమాండో బృందాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఎస్పీ కాంతిరాణా ఆదేశాలతో ఓ పోలీసు బృందం ఉగ్రవాదులతో చర్చలు జరిపి లొంగిపోవాల్సిందిగా కోరింది. కానీ వారు అంగీకరించకపోవడంతో కమాండో బృందాలు ఇంటిపై నుంచి రంద్రాలు చేసి పది వరకూ బాష్పవాయువు గోళాలను ఇంట్లోకి వదిలారు. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడటంతో బిలాల్‌ భార్య, ముగ్గురు పిల్లలు మొదట బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు బయటికొచ్చి లొంగిపోయారు. అప్పటికే బుల్లెట్‌ గాయమైన ఇస్మాయిల్‌ను ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఇద్దరినీ తమిళనాడు పోలీసులకు అప్పగించారు.

...అందుకే పుత్తూరు: డీజీపీ


ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉగ్రవాదులు పుత్తూరులో షెల్టర్‌ తీసుకుని ఉంటారని డీజీపీ బి.ప్రసాదరావు చెప్పారు. వారు తిరుమలలో పేలుళ్లకు కుట్ర పన్నారా అన్నది విచారణలోనే తేలుతుందన్నారు. ఉగ్రవాదులున్న రెండు ఇళ్లలో ఒక పిస్టల్‌, భారీగా పేలుడు పదార్థాలు, 80 జిలెటెన్‌ స్టిక్‌‌స, పేల్చడానికి సిద్ధంగా ఉంచిన ఆరు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

‘ఉగ్ర’ కదలికలపై నిఘా లోపం


రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలను పసిగట్టడంలో మన ఇంటెలిజెన్‌‌స విభాగం వైఫల్యాన్ని పుత్తూరు ఉదంతం మరోసారి కళ్లకు కట్టింది. తిరుపతి సహా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలున్న చిత్తూరు జిల్లాలో ఏకంగా 6 నెలలపాటు ఉగ్రవాదులు కుటుంబాలతో పాటుగా మకాం వేసినా పసిగట్టలేకపోవడం రాష్ట్ర నిఘా వైఫల్యానికి పరాకాష్టగా భావిస్తున్నారు. తమిళనాడు పోలీసులు ఆపరేషన్‌కు దిగేదాకా వారి ఆనుపానులు కూడా రాష్ట్ర పోలీసులకు ఏమాత్రమూ తెలియకపోవడం గమనార్హం!

ఆక్టోపస్‌ తొలి ఆపరేషన్‌ సక్సెస్‌


ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెరర్రిస్‌‌ట ఆపరేషన్‌‌స (ఆక్టోపస్‌) తొలిఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది. ఒక్క బులెట్‌ పేలకుండానే పని పూర్తి చేసింది. రెండు ఆక్టోపస్‌ యూనిట్‌లు తిరుమలలో భద్రత కోసం ఉండగా, 250 మంది హైదరాబాద్‌లో ఉన్నారు. తెలంగాణ ఆందోళనలప్పుడు విద్యుత్‌సౌధ లోపల తాళం వేసుకున్న ప్రజాప్రతినిధులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల తర్వాత తనిఖీల్లో ఆక్టోపస్‌ కమెండోలు పాల్గొన్నా ఉగ్రవాద నిరోధక చర్యల్లో నేరుగా పాల్గొన్నది మాత్రం పుత్తూరులోనే.


ఎవరీ ఫక్రుద్దీన్‌..?


 అల్‌ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన ఫక్రుద్దీన్‌ (48) కాశ్మీర్‌ మిలిటెంట్ల వద్ద శిక్షణ పొందాడు. తమిళనాడు మదురై జిల్లా సుంగంపల్లివాసల్‌ వీధికి చెందిన ఇతని కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. 2011లో బీజేపీ అగ్రనేత అద్వానీపై హత్యాయత్నం కేసు తదితరాల్లో ఫక్రుద్దీన్‌ నిందితుడు. ఇతని అనుచరులు ఇస్మాయిల్‌, బిలాల్‌, అబూబకర్‌లపై రూ.20 లక్షల రివార్డుంది.

ఆపరేషన్‌ జరిగిందిలా..

తెల్లవారుజామున 3.30 గంటలు..

ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై పోలీసులు దాడికి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ లకష్మణ్‌తల, వీపుపై ఉగ్రవాదులు కత్తితో పొడిచారు. 4.30 గంటలు: అప్రమత్తమైన స్పెషల్‌ టాస్‌‌కఫోర్‌‌స పోలీసులు ఉగ్రవాదుల ఇంటిపై కాల్పులు జరిపారు. చనిపోయాడన్న ఉద్దేశంతో ఇన్‌స్పెక్టర్‌ లకష్మణ్‌ను ఉగ్రవాదులు ఇంటి బయటికి నెట్టేసి తలుపులు వేసుకున్నారు. ఇంటి వెనుకవైపునకు వెళ్లిన పోలీసులు ఉగ్రవాదులు షెల్టర్‌ తీసుకున్న మరొక ఇంట్లో రెండు బాంబులు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం 5 గంటలు: పోలీసులు... ముష్కరులు ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో వారు వంటగ్యాస్‌ సిలిండర్‌ను లీక్‌ చేసి పేల్చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఫైర్‌ ఇంజిన్‌ను పిలిపించి ఇంట్లోకి కిటికీ ద్వారా నీటిని పంప్‌ చేసి మంటలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.


ఉదయం 6 గంటలు: ఉగ్రవాదులు ఉన్న మేదరవీధి ప్రాంతానికి విద్యుత్‌ నిలిపేశారు. ఇంట్లో ఉన్న వారు టీవీల్లో న్యూస్‌ చూసి మరింత అప్రమత్తమయ్యే అవకాశం లేకుండా చేశారు.


ఉదయం 7 గంటలు: చిత్తూరు ఎస్పీ కాంతిరాణా, తిరువళ్లూరు ఎస్పీ అన్బూ ప్రత్యేక బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్న బాంబులను పరిశీలించారు.


ఉదయం 8 గంటలు: 50 మంది ఆక్టోపస్‌ కమాండోలు వచ్చారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు.
ఉదయం 9 గంటలు: ‘బిలాల్‌ మాపై నమ్మకం ఉంటే వెంటనే బయటకు వచ్చేయ్‌... ఆడవారిని, పిల్లల్ని బయటకు పంపేయ్‌...’ అని పోలీసులు తమిళంలో గట్టిగా అరిచి చెప్పారు. బదులుగా, ‘నేను అల్లా దగ్గరకు వెళ్లడానికైనా సిద్ధమే... మీరు మగాళ్లయితే లోపలికి రండి’ అంటూ ప్రతి సవాల్‌ విసిరాడు.


ఉదయం 9- మధ్యాహ్నం ఒంటి గంట: ఉగ్రవాదులున్న వీధిని పోలీసులు బ్లాక్‌ చేశారు. వారున్న పెంకుటిల్లులోకి వెళ్లే, దాడి చేసే అవకాశాలపై చర్చించుకున్నారు. చివరకు ఇంటి పైకప్పుకు డ్రిల్లింగ్‌ చేసి భాష్పవాయుగోళాలు లోపలకు జారవిడిచారు.

మధ్యాహ్నం 1.50 గంటలు: ఇంటి నుంచి ఒక మహిళ, ముగ్గురు పిల్లలను బయటకు పంపించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలు: ముందు గదిలో బాష్పవాయుగోళాలు పడడంతో ముష్కరులు వెనుక గదిలో దాక్కున్నారు. గంట తర్వాత లొంగిపోయƒూరు.


అలిపిరిలో ఇంతకుముందే రెక్కీ?
 

ఉగ్రవాదుల లక్ష్యం తిరుమలే అయి ఉండొచ్చని ఇంటెలిజెన్‌‌స వర్గాలు చెబుతున్నాయి. ఫక్రుద్దీన్‌ ఇచ్చిన సమాచారం మేరకు... తిరుమల అలిపిరి వద్ద ఉగ్రవాదులు బిలాల్‌, ఇస్మాయిల్‌.. మరో ఇద్దరితో కలిసి ఇంతకుముందే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు